జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగం

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లందరినీ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తనకు గన్‌మెన్లను కుదిస్తూ శనివారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు ఆదివారం కోటంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన గన్‌మెన్లు అందరినీ ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలోనే ఇద్దరు గన్‌మెన్లు కంటతడి పెట్టుకోగా.. వారిని ఓదార్చుతూ కోటంరెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ‘ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను. నాకు గన్‌మెన్లు అవసరం లేదు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ సమయంలో అదనపు భద్రత కల్పించకపోగా.. భద్రతను కుదించారు. నాకు కార్యకర్తలే రక్ష. మానసికంగా ఇబ్బంది పెట్టారనే గన్‌మెన్లను తొలగించారు. మీకే గిఫ్ట్ ఇస్తున్నా.. మిగిలిన ఇద్దరు కూడా నాకు వద్దు’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

‘నాకు వైసీపీ ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను ఇచ్చింది. నిన్న ఇద్దరు గన్‌మెన్లను వాపసు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరు. అనేకచోట్ల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పా. ఇలాంటి సమయంలో ఇంకా నాకు అదనంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలా కాకుండా ఉన్నవాళ్లలో ఇద్దరిని తొలగిస్తారా?’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *