Peddagattu Lingamanthula Swamy Jathara: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు జాతర కన్నుల పండువగా జరగనుంది. ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి భక్తులు రానున్నారు. దాదాపు 15 నుంచి 20 లక్షల భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పెద్దగట్టులో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి.. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జాతరపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే లింగమంతుల స్వామి జాతర.. ఐదోరోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగియనుంది.
ప్రత్యేక బస్సులు..
జాతర కోసం ప్రజా రవాణా సంస్థ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండతో పాటు పక్కా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. సూర్యాపేట డిపో నుంచి 60, కోదాడ నుంచి 20, మిర్యాలగూడ డిపో నుంచి 8 బస్సులను జాతరకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన మార్గాల్లో వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించనున్నారు. నేటి నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఫిబ్రవరి 9 సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలన్నారు.
ఆంక్షలు ఇలా..
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా డైవర్ట్ చేస్తారు. రాఘవాపురం స్టేజ్, నామవరం, గుంజలూరు స్టేజ్ వద్ద తిరిగి 65వ నేషనల్ హైవేపైకి వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేశారు. భారీ, గూడ్స్ వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ (SRSP) కాల్వ నుంచి బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు డైవర్ట్ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. భారీ, గూడ్స్ రవాణా వాహనాలు కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలని సూచించారు. అవసరమైతే వ్యక్తిగత వాహనాలు సైతం ఇదే మార్గంలో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.
97603766
Read More Telangana News And Telugu News