నాందేడ్ సభలో బాల్క సుమన్‌పై కేసీఆర్ ప్రశంసలు.. ఈ ఎలివేషన్ అందుకేనా..?

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కాగా.. ఈ సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గులాబీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తోన్న క్రమంలో.. ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీని చాలా మంది ఎగతాళి చేస్తున్నారని.. ఈయనతో ఏమవుతుందంటూ చులకనగా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆకారాలు పెద్దగా ఉన్న నేతలకు బయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నేతలు ఎక్కడి నుంచో రారని.. మన నుంచే వస్తారంటూ కేసీఆర్ వివరించారు. మనలో నుంచే నేతలను ఎన్నుకోవాల్సన అవసరం ఉందని సూచించారు. అదే క్రమంలో.. తెలంగాణలో కూడా అలాంటి ఓ నేత ఉన్నాడంటూ బాల్క సుమన్‌ను వేదికపై నుంచి మహారాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. ఉద్యమంలో ధైర్యంగా పోరాడి.. అతి చిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికయ్యాడని ప్రశంసించారు. అందుకు కారణం.. అతనిలో ఉన్న దమ్ము, ధైర్యం, నిజాయితీ లాంటి లక్షణాలేనంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

“తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో బాల్క సుమన్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నారు. ఉద్యమం సమయంలో మాతో పాటు నడిచాడు. ధైర్యంగా పొరాడాడు. అన్నింటా ముందుండి తెలంగాణ కోసం కొట్లాడాడు. ఆ తర్వాత అతి చిన్న వయసులోనే.. మొట్ట మొదటిసారే ఎంపీగా ఎన్నికయ్యాడు. అతను ఎంపీ అయ్యే సమయానికి 29 ఏళ్లు. బాల్క సుమన్ చాలా చిన్న వ్యక్తి. విద్యార్థి. అలాంటిది ఎంపీ ఎలా అయ్యాడు. పోరాడే దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉన్న వ్కక్తి కాబట్టే నాయకుడయ్యాయి. వేరే నేతలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనలో నుంచి నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.” అంటూ బాల్క సుమన్‌ను ఉదాహరణగా చూపుతూ కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

అయితే.. బాల్క సుమన్‌కు ఇంత ఎలివేషన్ కేసీఆర్ ఇవ్వటానికి కారణం మాత్రం వేరే ఉందంటున్నాయి శ్రేణులు. బాల్క సుమన్‌కు ఎంపీగా చేసిన అనుభవం ఉంది.. అందులోనూ హిందీ, ఇంగ్లీష్ బాషలు మాట్లాడగలడు.. విద్యావంతుడు.. అందులోనూ యువకుడు కావటం వల్ల తనతో పాటు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. నాందేడ్ సభ ఏర్పాటు, వ్యవహారాలన్నీ బాల్క సుమనే దగ్గరుండి చూసుకోవటం గమనార్హం. అయితే.. మహారాష్ట్రకు సంబంధించిన పార్టీ వ్యవహారాల్లో ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉండొచ్చన్నది శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మరి చూడాలి.. ఇంత ఎలివేషన్ ఇవ్వటం వెనుక గులాబీ బాస్ ఆంతర్యమేమిటో…?

97609524

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *