నేటి నుంచి లింగమంతుల స్వామి జాతర

నేటి నుంచి లింగమంతుల స్వామి జాతర సూర్యాపేట, వెలుగు: తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌‌‌‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర  దాదాపు 250 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లు  చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.  ఐదు రోజులపాటు సాగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, చత్తీస్‌‌‌‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. జాతరకు దాదాపు 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లను  ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి. గుట్ట చుట్టూ శానిటైజేషన్  నిర్వహణకు మున్సిపల్‌‌‌‌ యంత్రాంగం మూడు షిఫ్టులలో 160 మంది సిబ్బంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో 8  వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో డ్యూటీ చేయనున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను నడపనుంది. లింగమంతుల స్వామికి అలంకరించే మకర తోరణాన్ని సూర్యాపేట గొల్ల బజార్ నుంచి పెద్దగట్టు మీదకు తరలించారు. వల్లపు వంశస్తుల వద్ద  ఉండే ఈ మకర తోరణాన్ని ఆదివారం రాత్రి లింగమంతుల స్వామిని ప్రతిష్టించిన అనంతరం సంప్రదాయబద్ధంగా స్వామికి  అలంకరిస్తారు. శనివారం గొల్ల బజార్ నుంచి బేరీలు, కటార్లు, కత్తుల విన్యాసాల మధ్య  మంత్రి జగదీశ్​రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మకర తోరణాన్ని తరలించారు. 

గంపల ప్రదక్షిణతో జాతర షురూ

లింగమంతుల స్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌‌‌‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఐదో రోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *