Women’s T20 World Cup 2023 : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ (T20 World Cup 2023)కు ఫిబ్రవరి 10వ తేదీన తెర లేవనుంది. మొత్తం 10 జట్లు ఇందులో తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గా ఆస్ట్రేలియా టోర్నీలో అడుగుపెట్టనుంది. 2020లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ (India) నెగ్గి కప్పును అందుకుంది. ఇక ఈ టోర్నీలో హర్మన్ ప్రీత్ (HarmanPreet Kaur) నాయకత్వంలోని టీమిండియా (Team India) డార్క్ హార్స్ గా బరిలోకి దిగనుంది. ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగనున్నాయి. భారత్ తన తొలి పోరును ఈ నెల 12న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది.
ఇక మహిళల విభాగంలో ఇప్పటి వరకు ఏడు సార్లు టి20 ప్రపంచకప్ జరిగింది. తొలిసారి ఇంగ్లండ్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరిగింది. ఇక చివరిసారిగా ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగింది. మొత్తం 7 సార్లు జరగ్గా.. అందులో ఐదు సార్లు ఆస్ట్రేలియా మహిళల జట్టే చాంపియన్ గా నిలిచింది. 2010, 2012, 2014, 2018, 2020లలో ఆస్ట్రేలియా మహిళల జట్టు విశ్వవిజేతలుగా నిలిచింది. 2009లో జరిగిన తొలి ప్రపంచకప్ లో ఇంగ్లండ్ చాంపియన్ గా నిలిచింది. ఇక 2016లో వెస్టిండీస్ జట్టు చాంపియన్ గా నిలిచింది. ఇక ఇంగ్లండ్ జట్టు అత్యధికంగా మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు రెండు సార్లు.. భారత్, ఆస్ట్రేలియాలు చెరొకసారి రన్నరప్ గా నిలిచాయి.
మహిళల టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. మరోసారి ఈ ప్రపంచకప్ ను గెలిచి.. హ్యాట్రిక్ ను పూర్తి చేయాలనే పట్టుదల మీద ఉంది. అదే సమయంలో క్రితం సారి ఫైనల్ వరకు వచ్చి చివరి మెట్టుపై బోల్తా పడిన భారత్.. ఈసారి కప్పును ఎలాగైనా సాధించాలనే పట్టుదల మీద ఉంది. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇక సొంత దేశంలో జరుగుతున్న మెగా ఈవెంట్ లో విశ్వవిజేతగా నిలవాలని సౌతాఫ్రికా కూడా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మహిళల టి20 ప్రపంచకప్ ఆసక్తికరంగా జరగడం ఖాయం.
గ్రూప్ ‘ఎ’ : ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక
గ్రూప్ ‘బి’ : భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్