‘రెండేళ్లలో ఎలా సాధ్యం..?’ అదానీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రశ్నలు..

దేశంలో సంచలనంగా మారిన అదానీ సంస్థల వ్యవహారంపై గులాబీ అధినేత కేసీఆర్ స్పందించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కేసీఆర్.. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. సాధారణ వ్యాపారిగా ఉన్న అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారంటూ నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడైన అదానీ అంత ఫాస్ట్‌గా ఎలా డెవలప్‌ అయ్యారంటూ ప్రశ్నలు సంధించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని..ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం చెప్పి తీరాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా.. ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నేతలంతా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి.. కేవలం మాటలతోనే కాలం వెల్లదీస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు.

బీఆర్ఎస్‌కు అధికారమిస్తే దేశంలోని జలవిధానాన్ని పూర్తిగా మార్చేస్తామని కేసీఆర్ వివరించారు. దేశంలో కీలక ప్రాంతాల్లో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెబుతున్నారన్న కేసీఆర్.. ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా అమ్మేస్తున్నారని ఆరోపించారు. దేశంలో పుష్కలంగా బొగ్గు లభ్యమవుతుండగా విదేశాల నుంచి ఎందుకు కొనాల్సి వస్తోందన్న ప్రశ్నను లేవనెత్తారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్న కేసీఆర్‌.. వాటితో 125 ఏళ్లపాటు దేశమంతటికీ విద్యుత్‌ ఇవ్వొచ్చని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 90 శాతం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు… మహిళ ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుత ప్రగతి సాధిస్తుందన్న కేసీఆర్‌.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలోపే.. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు.

97622734

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *