వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన రైలుపైకి తాజాగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరికొట్టారు. ఈ దాడిలో సీ-12 కోచ్ (చైర్ కార్ కోచ్) విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసం అయింది. శుక్రవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
రైలు విశాఖపట్నం చేరుకున్న తర్వాత సిబ్బంది విండో గ్లాస్‌ను మార్చారు. ఈ కారణంగా శనివారం ఉదయం ఈ సెమీ హైస్పీడ్ రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విశాఖపట్నం నుంచి ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు 8:52 గంటలకు బయల్దేరింది.
దాడికి పాల్పడిన నిందితుల దృశ్యాలు ట్రైన్ కోచ్‌కు అమర్చిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ద్వారా అధికారులు నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రస్తుతం ఒకే వందే భారత్ రైలును తిప్పుతున్నారు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఇదే రైలు మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ వైపు బయల్దేరుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గతంలో ప్రారంభానికి ముందే రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖపట్నం సమీపంలోని కంచరపాలెంలో రామ్మూర్తి పంతులు పేట గేటు వద్ద ఆకతాయిలు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఆ దాడిలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు కోచ్‌కు అమర్చిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకున్నారు. వందే భారత్ రైళ్లపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది.
97583760
97588043