సీఎం జగన్‌కు ఉద్యోగుల అల్టిమేటం.. ఈ నెల 26 డెడ్‌లైన్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఈ నెల 26వ తేదీ లోపు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కర్నూలులో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతలోపు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాస్తామని తెలిపారు.

ఇక, ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర మహాసభ విజయవంతమైందని బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ 94 సంఘాల నుంచి 100 సంఘాలకు పెరిగిందని.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల మహాసభ ఎప్పుడూ జరగలేదన్నారు. సమస్యల పరిష్కారానికి మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారన్నారు. అసలు ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, దాంతో ఉద్యోగుల జీవితాలు దారుణంగా తయారైందని బొప్పరాజు ఫైరయ్యారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కార్డు కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు. డీఏలు ఇచినట్టే ఇచ్చి, ఆ వెంటనే వాటిని వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మనసు పెట్టకపోవడం వల్లే.. పరిష్కారం కావట్లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులుగా పని చేస్తూ.. రూ. 2,500 సంపాదించే వారికి కూడా రేషన్ కార్డు పోయిందని వాపోయారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదని.. సీఎం స్వయంగా పరిష్కరిస్తారని ఎదురు చూసినా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగులు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *