CM Kcr: తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

CM Kcr: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ నలుమూలలా చేపట్టిన నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో బాగా మాట్లాడారంటూ మంత్రి కేటీఆర్‌కు కేబినెట్ అభినందనలు తెలిపింది.

ఈ సందర్భంగా నేడు జరగనున్న మహారాష్ట్రలోని నాందేడ్ సభకు అందరూ హాజరుకావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం నాందేడ్‌కు సీఎం కేసీఆర్ బయలుదేరారు. నాందేడ్‌లో గురుద్వార్‌లో ప్రార్ధనలు చేయనున్న కేసీఆర్.. అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలో చేరనున్నారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. సభ నేపథ్యంలో ఇప్పటికే నాందేడ్ పట్టణం గులాబీమయంగా మారింది.

తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు నాందేడ్ సభకు వెళ్లనున్నారు. నాందేడ్ గురుద్వారా మైదానంలో ఈ సభ జరుగుతుండగా.. గత పది రోజులుగా రాష్ట్ర టీఆర్ఎస్ నేతలు అక్కడ ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాందేడ్ పట్టణంలో భారీగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు అయిన తర్వాత తొలి సభను ఖమ్మంలో నిర్వహించిన కేసీఆర్.. రెండో సభను నాదేడ్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ బయట తొలిసారి బీఆర్ఎస్ సభ జరుగుతుండటంతో.. ఈ సభపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *