IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురు దెబ్బ.. కీలక పేసర్ ఔట్..!

భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. పేసర్ జోష్ హెజిల్‌వుడ్ మొదటి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. గత నెలలో సిడ్నీ టెస్టులో బౌలింగ్ చేస్తుండగా.. అతడి ఎడమ కాలికి గాయమైంది. ఆ గాయం నుంచి అతడు ఇంకా కోలుకోలేదు. బెంగళూరు శివార్లలోని ఆలూరులో ఆసీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుండగా.. హేజిల్‌వుడ్ తన టీమ్‌మేట్స్‌కు సహకరించాడే గానీ ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొనలేదు.

దీంతో నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం అవుతాడని భావిస్తున్నారు. అదే జరిగితే స్కాట్ బోలాండ్‌కు తొలి ఓవర్సీస్ టెస్టు ఆడే అవకాశం లభిస్తుంది. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టులోనూ హేజిల్‌వుడ్ ఆడటం అనుమానంగానే ఉంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు ఇప్పటికే మిచెల్ స్టార్క్ దూరమయ్యాడు. దీంతో ప్రధాన పేసర్లు ఇద్దరు లేకుండానే ఆస్ట్రేలియా తొలి టెస్టులో బరిలోకి దిగనుంది. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం తొలి టెస్టు ఆడే అవకాశాలు దాదాపుగా లేవు.

గాయాల కారణంగా హేజిల్‌వుడ్ గత రెండేళ్లలో నాలుగు టెస్టులు మాత్రమే ఆడటం గమనార్హం. ఏ సిరీస్‌లోనూ ఒక్క మ్యా్చ్‌కు మించి ఆడలేకపోయాడు. పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆడిన హేజిల్‌వుడ్.. ఆ తర్వాత సైడ్ స్ట్రెయిన్ కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. తర్వాత సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆడాడు. వర్షం కారణంగా ఆటంకం కలిగిన ఆ టెస్టులో హేజిల్‌వుడ్ మరోసారి గాయపడ్డాడు.

తరచూ గాయాలు వేధిస్తుండటంతో.. టీ20లపై ఫోకస్ పెట్టిన హేజిల్‌వుడ్.. వచ్చే ఏడాదిపాటు టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నాడు. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు కొద్ది నెలల గ్యాప్‌లోనే ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో తలపడనుంది. జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఆ జట్టు ఆడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *