ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుపై విచారణపై క్లారిటీ వచ్చింది. ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని కేసులు, అమరావతి పిటిషన్ల (Amaravati Petitions )పై త్వరగా విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరింది. సోమవారం ఉదయం జగన్ సర్కార్ తరపు లాయర్.. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనాన్ని కోరారు. జనవరి 27న కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు అందాయని అమరావతి రైతుల (Amaravati Farmers) తరపు లాయర్లు తెలిపారు. తాము కౌంటర్ దాఖలు చేయడానికి కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. అందుకే ఈనెల 23న విచారణకు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు (Ap High Court) తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది. ఇటు అమరావతి రైతులు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ త్వరితగతిన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ నెల 23న విచారణ జరగనుండటంతో అందరిలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది.
ఇటు ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని.. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతానన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. దీంతో ఉగాది తర్వాత విశాఖ నుంచి పాలన ప్రారంభం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు కూడా పదే, పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి సీఎం, మంత్రులు పదే, పదే ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు లాయర్లు ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. సీఎం జగన్, ఏపీ మంత్రులపై సుప్రీం కోర్టు అటార్నీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయ పరిధిలో రాజధాని అంశం ఉండగా.. విశాఖ రాజధాని కాబోతుందని ఏపీ సీఎం చేసిన ప్రకటనను సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Latest
Andhra Pradesh News
and