కొండా సురేఖ రీఎంట్రీ.. రసవత్తరంగా మారనున్న వరంగల్ పాలిటిక్స్

Warangal: వరంగల్ రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. ఇందుకు కారణం.. మాస్ రెబల్ లీడర్ కొండా సురేఖ రీఎంట్రీ. ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న కొండా సురేఖ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. కాగా.. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల ప్రకటించటమే అందుకు నిదర్శనం. కొండా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని.. అది కూడా కొండా సురేఖనే అని మురళి ప్రటించారు. గతంలో పోటీ చేసి గెలిచిన వరంగల్‌ తూర్పు నుంచే.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగనున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. దీంతో వరంగల్ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

2014లో వరంగల్‌ తూర్పు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖ గెలిచారు. అనంతరం.. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో వెంటనే కొండా దంపతులు హస్తం పార్టీకి షిఫ్ట్ అయ్యారు. పరకాల నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కొండా సురేఖ.. ఓటమి చవి చూశారు. ఇక అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ.. ఉనికి చాటుకున్నారు. అయితే.. ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో జనాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న హాత్ సే హాత్ జోడో యాత్రతో ప్రజల్లోకి పూర్తిగా వెళ్లి.. తమ సత్తా చాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 9 నుంచి వరంగల్ తూర్పులో పాదయాత్ర చేస్తామని కొండా మురళి ఇప్పటికే ప్రకటించారు.

తూర్పు నియోజకవర్గం మొత్తం అణువణువునా తెలిసిన కొండా సురేఖ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగడుతూనేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా తన స్థానాన్ని కాపాడుకునేందుకు రకరకాల కార్యక్రమాలతో జనాల్లో ఉంటున్నారు. అభివృద్ధి నినాదంతో.. మిగతా పార్టీల నేతలను గులాబీ పార్టీలోకి ఆకర్షిస్తూ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ స్థానంపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకే టికెట్ అవకాశాలు ఉండటంతో.. ఆయన కూడా జనాలతో మమేకమవుతున్నారు. ఒక్కసారిగా మూడు పార్టీలు యాక్టివ్ కావటంతో.. వరంగల్ తూర్పులో రాజకీయం రసవత్తరంగా మారిందన్న చర్చ సాగుతోంది.

97609524

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *