టీడీపీ కాదంటే నా ఆప్షన్ ఆ పార్టీనే: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీకి దూరమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పయనం ఎటు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.. టీడీపీలో టికెట్ ఖాయమా.. ఇంకేదైనా ఆలోచన ఉందా.. ఒకవేళ టీడీపీ కాదంటే పరిస్థితి ఏంటి. కొద్దిరోజులుగా నడుస్తున్న చర్చ ఇది.. దీనిపై కోటంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన రాజకీయ పయనంపై తేల్చి చెప్పారు.

తనకు అవకాశం వస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టేశారు. చంద్రబాబు, లోకేష్ అవకాశం ఇస్తే పోటీచేస్తా.. జిల్లాలో పది సీట్లలో టీడీపీ గెలిచేందుకు పనిచేస్తాను.. అలాగే అంకితభావంతో ఉంటాను అన్నారు.రాజకీయాలు తనకు శ్వాస, ధ్యాస, ఆశ అన్నారు. తనను ఇక్కడున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐలు వద్దు అనుకున్నా సరే.. తాను బీహర్ వెళ్లి తేజస్వి యాదవ్‌, యూపీలో ములాయం కొడుకు అఖిలేశ్‌ని, లేకపోతే మాయవతినో కలిసి ఆ పార్టీలో పదవి తెచ్చుకుని.. తన వాహనానికి జెండా కట్టుకుని తిరుగుతాను అన్నారు.

అంతేకాదు ఒకవేళ బీహార్, యూపీ పోవాలంటే విమానం ఎక్కాలి కాబట్టి.. మన పక్కనే ఉన్న తమిళనాడుకు పోయి స్టాలిన్‌ దగ్గరకు పోయి ఆ పార్టీ పదవి తెచ్చుకుంటానన్నారు. ఎందుకంటే మూడు వేల మంది ఓటర్లు కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కూడా ఉంది కదా అన్నారు.. పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉన్నారు.. అడిగితే ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి ఉందని.. మరో 15నెలలు అధికారం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను ఒకవేళ టీడీపీలో చేరితే కచ్చితంగా ఆ పార్టీ కోసమే పని చేస్తానని.. ఇకపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తాను అన్నారు. తనకు వ్యక్తిగతంగా జగన్‌పై కక్ష పెంచుకునే పనులకు వ్యతిరేకమన్నారు. తనకు ఓ నెల ముందు వరకూ ఎలాంటి ఆలోచన లేదని.. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఎవరిని కలిసినా ప్రశ్నించే హక్కు లేదన్నారు. తాను మౌనంగా వెళ్లిపోదామనుకున్నానని.. కానీ తనను రెచ్చగొట్టి ఇలా మాట్లాడే పరిస్థితికి తెచ్చారన్నారు.

తాను రెండోసారి విజయం సాధించిన మొదటి మూడునెలల్లో కొన్ని తప్పులు చేశానన్నారు కోటంరెడ్డి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఇలా అధికార మదం ఎక్కించుకోకూడదని ఆత్మపరిశీలన చేసుకున్నానని.. తనవల్ల బాధపడిన వారికి అప్పట్లోనే వారి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పానన్నారు. తనను ఇష్టపడేవారికి, వ్యతిరేకించే వారికి మరోసారి సారీ చెప్పారు శ్రీధర్ రెడ్డి. తాను గతంలో కొన్ని విమర్శలు చేశానని.. జగన్‌ పిలిచి ఇది మాట్లాడాలని చెబితే మాట్లాడక తప్పదు కదా అన్నారు. అయితే మరికొందరిలో అభద్రతా భావం ఉందని.. తాను ట్యాపింగ్‌ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *