Australia tour of India: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ (IND vs AUS Test Series)కి ముందు విమర్శల వేడి పెరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాల ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగగా.. సోషల్ మీడియాలోనూ వార్ మొదలైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్టు (India vs Australia 1st Test) మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు మ్యాచ్ ముంగిట టీమిండియాపై వెటకారంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? 2020 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన తీరు ఉంది.
2020, డిసెంబరులో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ 36 పరుగులకే చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు హేజిల్‌వుడ్ (5/8), పాట్ కమిన్స్ (4/24) ఆ మ్యాచ్‌లో నిప్పులు చెరిగారు. దెబ్బకి టీమ్ ఇండియాలో కనీసం ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేయలేకపోయారు. పృథ్వీ షా (4), మయాంక్ అగర్వాల్ (9), నైట్ వాచ్‌మెన్ జస్‌ప్రీత్ బుమ్రా (2), చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్య రహానె (0), హనుమ విహారి (8), వృద్ధిమాన్ సాహా (4), అశ్విన్ (0), ఉమేశ్ యాదవ్ (4) ఔటైపోగా.. మహ్మద్ షమీ (1) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకర ఘటనగా ఇప్పటికీ ఈ ఇన్నింగ్స్ గురించి మాజీ క్రికెటర్లు చెప్తుంటారు.
నాగ్‌పూర్ టెస్టు ముంగిట ఈ అడిలైడ్ టెస్టు వీడియోను షేర్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా ‘‘36 పరుగులకే ఆలౌట్. ది బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ గురువారం నుంచి ప్రారంభం’’ అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ పరమార్థం ఏంటంటే? భారత క్రికెటర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే. దాంతో ఆస్ట్రేలియా కుటిల ప్రయత్నాన్ని గమనించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ‘మరి.. ఆ సిరీస్ స్కోర్ లైన్? ఊరికే అడుగుతున్నా’ అని కౌంటరిచ్చాడు.
అడిలైడ్ టెస్టులో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమ్ ఇండియా.. ఆ తర్వాత పుంజుకుని.. నాలుగు టెస్టుల ఆ సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుని చారిత్రక రికార్డుని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది. దాంతో ఆ సిరీస్ ఫలితాన్ని కూడా చెప్పాలని ఆకాశ్ చోప్రా పరోక్షంగా కౌంటర్ వేశాడు. దెబ్బకి అటు నుంచి సమాధానం లేదు.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు రెండు సార్లు టెస్టు సిరీస్ గెలిచింది. కానీ.. భారత్ గడ్డపై మాత్రం 2004 నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా టీమ్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. సిరీస్‌కి ముందే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఇరు దేశాల అభిమానుల మధ్య కవ్వింపులు మొదలైపోయాయి.