తెలంగాణలో మండిపోతున్న బియ్యం ధరలు.. ఈ నెలలో ఎంత పెరిగాయంటే..?

తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి నెల గడవాలంటే.. జేబులకు చిల్లులు పడాల్సివస్తోంది. రూపాయో రెండు రూపాయలో వెనకేసుకుందామనుకుంటే.. మరో పది రూపాయలు అప్పే అవుతుంది తప్పా మిగలటం లేదంటూ సామాన్యులు వాపోతున్నారు. కూరగాయాల దగ్గరి నుంచి బియ్యం వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టులేదు.. అంటూ జానపద గేయంలో పాడుకున్నట్టు మారింది సామాన్యుల పరిస్థితి. ప్రధానంగా బియ్యం ధరలు చూస్తే ప్రజలకు ముద్ద దిగట్లేదు. ఇటీవలి కాలంలో బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండగా.. కేవలం ఈ నెలలోనే దాదాపు 10 శాతం పెరిగినట్టు సమాచారం. ఇందుకు కారణం.. తెలంగాణలో ధరల నియంత్రణ యంత్రాంగం లేకపోవటమేనంటున్నారు విశ్లేషకులు.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా యంత్రాంగం లేకపోవడం వల్ల.. రైస్‌మిల్లుల యజమానులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. గతేడాదిలో పంటలు బాగా నష్టపోయాయని.. అందుకే ధరలు పెంచాల్సి వస్తోందంటూ మిల్లు యజమానులు చెప్తుంటే.. మిల్లు నుంచి వచ్చే ధరకే లాభం చూసుకుని బియ్యాన్ని విక్రయిస్తున్నామని రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత మార్కెట్‌లోకి కొత్త బియ్యం రావడంతో ధరల పెరుగుదల మామూలేనని వ్యాపారులు చెబుతున్నారు.

మిల్లు యజమానులు, రిటైల్ వ్యాపారులు చెప్తున్న దాని ప్రకారం.. పంటలు పెద్దఎత్తున నష్టపోయాయనుకున్నా.. కొత్త బియ్యం ధరలను మాత్రమే పెంచాలి.. కానీ వ్యాపారులు మాత్రం కొత్త బియ్యంతో పాటు పాత బియ్యం ధరలు కూడా అమాంతం పెంచేస్తున్నారు. గత నెల రోజులుగా సోనా మసూరి నెంబర్ వన్ బియ్యం ధర రూ.6 నుంచి రూ.8 పెరగ్గా, ఇప్పుడు కిలో బియ్యం రూ.46 నుంచి 48కి విక్రయిస్తున్నారు. వీటితో పాటు కొత్త బియ్యం ధర కూడా 4 నుంచి 6 పెంచారు వ్యాపారులు.

ఓవైపు.. రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరిగిందని.. రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని.. దేశానికి అన్నపూర్ణగా మారిందని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యులు బియ్యం కొనేందుకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేసినా.. పట్టించుకునే నాథుడే లేకపోవటంతో ఇలాంటి దుస్థితి నెలకొందని ప్రజలు మండిపడుతున్నారు.

97640915

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *