నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం… ఏమిటీ కథ?

భారతదేశంలో నందాదేవి రెండవ అత్యంత ఎత్తైన పర్వతం. ఉత్తరాఖండ్‌లో నందాదేవిని ఒక దేవతగా కొలుస్తారు. ఈ దేవతకు 12 ఏళ్లకు ఒకసారి ‘రాజ్ జాట్ యాత్ర’ ఉత్సవం నిర్వహిస్తారు. యాత్ర జరిగే దారిలోనే వందలాది ఎముకలతో నిండిన రూప్ కుండ్ సరస్సు ఉంది.

కార్బన్ డేటింగ్ ప్రకారం, రూప్ కుండ్‌లోని ఎముకలు కనీసం 1200 సంవత్సరాల నాటివి. వీటికి సంబంధించి పలు జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఈ ఎముకల అసలు రహస్యం ఏమిటో ఎవరికీ కచ్చితంగా తెలియదు.

పర్వత పుత్రిక నందాదేవిని కలుషితం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె ఉగ్రరూపం దాలుస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం. కామంతో రగిలిపోతున్న రాక్షసుడు, గేదె ముఖం గల మైఖాసురుడిని నందాదేవి అంతమొందించిందని ఒక కథ. అలాగే కన్నౌజ్ రాజు తీర్థయాత్రకు వెళ్లినప్పుడు విలాస వస్తువులను, నాట్యగత్తెలను వెంట తీసుకువెళ్లడం నందాదేవికి కోపం తెప్పించిందని మరో కథ.

అయితే, “ఈ కథలన్నీ ప్రతీకాత్మకమైనవని” చరిత్రకారుడు, రచయిత, పర్యావరణవేత్త శేఖర్ పాఠక్ అంటారు.

1808 సంవత్సరం వరకు నందాదేవిని ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా పరిగణించారు. ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తైనదని భావించారు. అయితే, తరువాతి సంవత్సరాలలో నందాదేవి కన్నా ఉన్నత శిఖరాలను కనుగొన్నారు. కానీ, నందాదేవి పట్ల ఉన్న భక్తి, గౌరవం మాత్రం ప్రజల మనసుల్లో అలాగే ఉండిపోయింది.

 • హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
 • హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మృతి.. 20 మంది గల్లంతు

నందాదేవి ‘రాజ్ జాట్ యాత్ర’

హిమాలయాలపై వచ్చిన మంచి పుస్తకాలలో స్టీఫెన్ ఆల్టర్ రాసిన ‘బికమింగ్ ఎ మౌంటైన్‌’ ఒకటి. “హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో దేవతలు కొలువుంటారని హిందువులు విశ్వసిస్తారు. అలాంటి పవిత్ర స్థానాలకు మానవులు వెళ్లడం మంచిది కాదని, అది దేవతలకు అగౌరవమని భావిస్తారు” అని స్టీఫెన్ ఆల్టర్ తన పుస్తకంలో రాశారు.

బహుశా అందుకే కొందరు హిమాలయాల ఒడిలో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ‘దేవ భూమి’ అని కూడా పిలుస్తారు. స్టీఫెన్ ఆల్టర్ రూప్ కుండ్ ఎముకల సరస్సు గురించి కూడా వివరంగా రాశారు.”సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్ కుండ్ సంవత్సరంలో ఎక్కువ కాలం గడ్డకట్టుకుపోయి ఉంటుంది. జూలై, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే ఇక్కడ మంచు కరుగుతుంది. అప్పుడు సరస్సులోని ఆకుపచ్చని నీటిలో వందల కొద్దీ ఎముకలు బయటికి కనిపిస్తాయి. అవన్నీ మానవ అస్థిపంజరాలే. అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద రహస్యం. నిజమేమిటో ఎవరికీ తెలీదు” అని రాశారు.

రాజ్ జాట్ యాత్ర ప్రపంచంలోని పొడవైన పర్వత యాత్రలలో ఒకటి. భక్తులు 290 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. నందాదేవిని పుట్టింటి నుంచి అత్తింటికి పల్లకీలో తీసుకెళతారు. భక్తులు మధ్య మధ్యలో ఆగుతూ ఈ యాత్ర మొత్తం పూర్తి చేస్తారు. రాజ్ జాట్ యాత్ర చమోలీలోని నౌతి గ్రామం నుంచి మొదలై నందాకిని నది వరకు సాగుతుంది. గంగానది పాయల్లో నందాకిని ఒకటి.పురాణాల ప్రకారం, నందాదేవి పర్వత పుత్రిక. ఆమె శివుడిని వివాహం చేసుకుంటుంది.

 • జోషిమఠ్‌: ఎందుకు కుంగిపోతోంది? జనం ఎందుకు ఇళ్లు వదిలి పోతున్నారు?
 • జోషీమఠ్ భవితవ్యంపై స్థానికులలో ఆందోళన

కన్నౌజ్ రాజు కథ

నందాదేవి గురించి చెప్పుకునే జానపద కథలలో కన్నౌజ్ రాజు కథ ఒకటి.

కన్నౌజ్ రాజు, గర్భవతి అయిన భార్యతో కలిసి నందాదేవిని దర్శించుకోవడానికి వెళతాడు. వాళ్లు సరస్సు దాటుతున్న సమయంలో పెద్ద తుపాను వస్తుంది. భయంతో రాణికి నొప్పులు మొదలవుతాయి. అక్కడే బిడ్డకు జన్మనిస్తుంది. సరస్సులో నీరు కలుషితమైంది. దాంతో, ఆగ్రహించిన దేవత భీకరమైన వడగళ్ల వాన కురిపిస్తుంది. రాజు, రాణి, వెంట వచ్చిన ప్రజలు అక్కడికక్కడే మరణిస్తారు.

“పైకి వెళ్లే కొద్దీ మొక్కల్లో, వృక్షాల్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది. అలాగే, నందాదేవికి సంబంధించిన కథలు కూడా మారుతూ ఉంటాయి” అంటారు స్టీఫెన్ ఆల్టర్. కన్నౌజ్ రాజుకు చెందిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. తీర్థయాత్రకు పయనమైన రాజు విలాస వస్తువులను, నాట్యగత్తెలను వెంటతెచ్చుకున్నాడు. మంచుతో కప్పి ఉన్న పర్వతాల అందానికి ముగ్ధుడై నాట్యగత్తెలను నృత్యం చేయమని ఆదేశిస్తాడు. ఇది దేవతకు కోపం తెప్పిస్తుంది. అక్కడ ఉన్నవారంతా ఆమె ఆగ్రహజ్వాలలకు బలై, మరణిస్తారు.

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌కు చెందిన ‘నేచర్ కమ్యూనికేషన్స్’ ఈ ఎముకల సరస్సు, ఇతర అంశాలపై ఒక అధ్యయనం జరిపింది. ఎముకల సరస్సుకు సంబంధించిన ప్రశ్నలు రాను రాను మరింత జఠిలమవుతున్నాయని అందులో పేర్కొన్నారు.

రూప్ కుండ్‌లో ఎవరి ఎముకలు ఉన్నాయి?

గతంలో ఇక్కడ దొరికిన అస్థికలపై జరిపిన డీఎన్ఏ అధ్యయనాలలో, అన్ని ఎముకలు దక్షిణాసియా మూలానికి చెందిన వ్యక్తులవని కనుగొన్నారు. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం, ఈ ఘటన సుమారు 800వ సంవత్సరంలో జరిగింది. దీన్ని బట్టి వీరంతా ఒకే సమయంలో చనిపోయారని భావిస్తున్నారు.

అయితే, కొన్నేళ్ల క్రితం మళ్లీ మూడు డజన్లకు పైగా ఎముకలపై జరిపిన జన్యు విశ్లేషణలో, కొన్ని అస్థికలు గ్రీస్ ప్రజలకు సంబంధించినవని గుర్తించారు. ఆ సమయంలో గ్రీకులు హిమాలయాలకు ఎందుకు వచ్చారు? అప్పట్లో ఏదైనా తీర్థయాత్ర జరిగిందా, అందులో గ్రీకులు పాల్గొన్నారా? వంటి ప్రశ్నలన్నీ తెరపైకి వచ్చాయి.

క్రీ.పూ. 300 సంవత్సరాలకు పూర్వం నుంచి భారతదేశానికి గ్రీస్‌తో సంబంధం ఉంది. అప్పటి నుంచే గ్రీకులు భారతదేశానికి రావడం ప్రారంభించారు. ఆ కాలంలోనే అలెగ్జాండర్ సైన్యాధిపతి సెల్యూకస్‌ను ఓడించి చంద్రగుప్తుడు మౌర్య రాజ్య స్థాపన చేశాడు.

హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని ఆంత్రోపాలజీ విభాగానికి చెందిన విలియం సాక్స్ ఈ ప్రాంతంపై సుదీర్ఘ పరిశోధన చేశారు. రాజ్ జాట్ యాత్రపై వివరణాత్మక పుస్తకాన్ని రాశారు. “అక్కడ ఏం జరిగిందన్నది మన అవగాహనకు మించినది” అని ఆయన అంటారు.

 • కర్ణ్‌ప్రయాగ్‌: జోషీమఠ్‌లాగే ఇక్కడా ఇళ్లకు పగుళ్లు… ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు
 • జోషీమఠ్: కుంగిపోతున్న ఈ నగరానికి మహాభారతానికి ఏంటి సంబంధం?

ప్రకృతికి కోపం రావడం వెనుక మర్మం

1800 దశకం ప్రారంభంలో జరిపిన ‘గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా’ తరువాత నందాదేవి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో 23వ స్థానంలో నిలిచింది.

పర్వతారోహకులు 1936లో తొలిసారిగా నందాదేవి శిఖరాన్ని చేరుకోగలిగారు. ఆ తరువాత గర్వాల్, కుమావున్‌లో భయంకరమైన వరదలు వచ్చాయని చెబుతారు. మానవులు నందాదేవిపై అడుగుపెట్టడం వల్లే దేవత ఆగ్రహించిందని, అందుకే వరదలు వచ్చాయని స్థానికులు నమ్ముతారు.

ఈ నమ్మకాలు, విశ్వాసాల వెనుక ఉన్న మార్మాన్ని అర్థం చేసుకోవాలని ప్రఖ్యాత పర్యావరణవేత్త చండీ ప్రసాద్ భట్ అంటారు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి ఆగ్రహానికి గురవుతుందని నమ్మడం కొత్తేమీ కాదని, జోషిమఠ్ విషయంలో కూడా స్థానికులు ఇలాగే అనుకుంటున్నారని ఆయన అంటారు.

1976 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీలకు చండీ ప్రసాద్ భట్ కొన్ని లేఖలు రాశారు. ఆ తరువాతే మహేష్ చంద్ర మిశ్రా కమిటీ ఏర్పడింది. భౌగోళికంగా సున్నితమైన ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులను నిషేధించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. అటవీ సంపద పెంచాలని సూచించింది.

1970లలో ప్రారంభమైన చిప్కో ఉద్యమంలో చండీ ప్రసాద్ భట్ కీలక పాత్ర పోషించారు. 1970 జూలైలో వినాశకరమైన వరదలు సంభవించిన తరువాత చిప్కో ఉద్యమం ఊపందుకుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, భారతదేశం, యురేషియా భాగాలలో భౌగోళిక పొరల తాకిడి కారణంగా 2900 కిలోమీటర్ల పొడవైన పట్టీ ఏర్పడింది. ఇందులో భాగంగానే భారత్, టిబెట్, నేపాల్ దేశాలు ఏర్పడ్డాయి. ఇది హిమాలయాలకు దిగువ భాగం. ఇక్కడ తరచూ భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువ.

అందుకే హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను నిలిపివేయాలని జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సహా అనేక ఇతర సంస్థలు సలహాలు, సూచనలు అందించాయి. అయినప్పటికీ, ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోడ్ల నిర్మాణం వరకు అనేక ప్రాజెక్టులు ఊపందుకున్నాయి.

 • హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
 • భారత్-నేపాల్‌ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది

భారీ ప్రాజెక్టులు

2021 ఫిబ్రవరిలో నందాదేవి నుంచి 38 కి.మీ దూరంలో ఉన్న రిషి గంగా పవర్ ప్లాంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో ప్లాంట్ సొరంగంలో 200 మందిపైగా చిక్కుకుపోయారు. చాలా మృతదేహాలు దొరకలేదు. ఇప్పుడు కూడా ఆ సొరంగంలో అస్థిపంజరాలు, ఎముకలు ఉండి ఉండవచ్చు.

ఇటీవల జోషిమఠ్ చర్చల్లోకి వచ్చింది. అక్కడ ఇళ్లు భూమిలోకి కుంగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)కు చెందిన తపోవన్-విష్ణుఘర్ ప్రాజెక్ట్ ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు, స్థానికులు చెబుతున్నారు.

అయితే, ఈ ప్రాజెక్ట్ సొరంగం నగరానికి చాలా దూరంగా ఉందని, ఇళ్లల్లో పగుళ్లు, భూమి కుంగిపోవడానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌టీపీసీ చెబుతోంది. దిగువ హిమాలయాల్లో భారీ ప్రాజెక్టుల గురించి నిరంతరంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధిని ఆకాంక్షించేవారు ఒకవైపు, పర్యావరణ పరిరక్షణకులు మరొకవైపు.. తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.

అభివృద్ధి అవసరమేగానీ పర్యావరణాన్ని కాపాడవలసిన ఆవశ్యకతనూ తిరస్కరించలేం. మరి ఈ రెండిటికీ మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇదీ అసలు ప్రశ్న. ఉత్తరాఖండ్ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద 12,000 కి.మీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇది గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే టిబెట్‌కు ఉత్తరాఖండ్‌కు సరిహద్దు ఉంది.

ఈ రోడ్డు నిర్మాణం “2013లో జరిగిన కేదార్‌నాథ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు నివాళి” అని ప్రధాని మోదీ అన్నారు. 2013 వరదలకు ఇళ్లు, భవనాలు, వాహనాలు, మనుషులు గడ్డిపరకల్లా కొట్టుకుపోయారు.

చాలా కాలం నుంచి ఉత్తరాఖండ్‌లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. 1880, 1936, 1978లలో వరదలు, 1991, 1999లలో భూకంపాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. నందాదేవిని అగౌరవపరచడం వల్లే ఈ విపత్తులన్నీ సంభవిస్తున్నాయని స్థానికుల నమ్మకం.

చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నందాదేవిపై ‘రేడియోయాక్టివ్ సెన్సార్’ అమర్చడానికి చేపట్టిన ప్రాజెక్ట్ కారణంగానే 2021లో తపోవన్ విషాదం సంభవించిందని చాలామంది భావిస్తున్నారు.అయితే అకస్మాత్తుగా వచ్చిన తుపాను కారణంగా ఈ ప్రాజెక్టును మధ్యలోనే నిలిపివేశారు. తరువాత ఒక బృందం అక్కడికి వెళ్లగా, ఆ సెన్సార్ కూడా దొరకలేదు. బహుశా మంచులో కూరుకుపోయి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:

 • పడయప్ప- పర్యటకులతో సరదాగా ఫోటోలకు పోజులిచ్చే ఈ ఏనుగుకు ఇప్పుడు ఎందుకు చెడ్డపేరు వస్తోంది-
 • వీడియో, ఆర్కిటిక్ మంచు ఖండం నుంచి విడిపోయిన మంచు పలక వ్యవధి, 1,28
 • దేశానికి రక్షణగా పెట్టని గోడలు – ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు..
 • మనిషి మృతదేహాన్ని ఎరువుగా ఎలా మారుస్తారు… కూరగాయలు ఎలా పండిస్తారు
 • భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా- ఇంగ్లండ్-లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా-

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *