నాకెంతో గౌరవం.. మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా: నందమూరి బాల‌కృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Bala Krishna) నర్సులకు క్షమాపణలు చెప్పారు. అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో నర్సుల‌పై చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్య ఫేస్‌బుక్‌ పోస్టులో ‘అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం’అన్నారు.

‘బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ’ అంటూ స్పందించారు.

బాలయ్య హోస్ట్‌గా ఉన్న అన్‌స్టాప‌బుల్ షోలో జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారమైన సంగతి తెలిసిందే. త‌నకు రోడ్డు ప్రమాదం జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ గుర్తు చేసుకున్నారు.. ఈ క్రమంలో న‌ర్సు గురించి ప్ర‌స్తావ‌న వచ్చింది. అయితే నర్సుల్ని ఉద్దేశించి ఆయన మాటలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని వివాదం రేగింది. బాలయ్య క్షమాపణలు చెప్పాలని ఆంధ్ర ప్ర‌దేశ్ న‌ర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ప్ర‌సాద్ డిమాండ్ చేశారు. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై బాలయ్య వ్యాఖ్య‌లు సరికాదని.. క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఆయన స్పందించారు.. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

బాలయ్య ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దేవ బ్రాహ్మణుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అలాగే అక్కినేని తొక్కినేని అంటూ చేసిన కామెంట్స్ వివాదం కావడంతో ఆయన స్పందించారు. తనకు అక్కినేని అంటే చాలా గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారన్నారు. ఇప్పుడు న‌ర్సులపై బాల‌య్య వ్యాఖ్యలపై వివాదం రేగింది. మరి బాలయ్య పశ్చాత్తాపంపై నర్సింగ్ సంక్షేమ సంఘం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *