IND vs PAK Controversy: పాకిస్థాన్(Pakistan)తో క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే భారత్‌కి భయమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ (Javed Miandad) ఎద్దేవా చేశాడు. ఈ ఏడాది పాక్ వేదికగా ఆసియా కప్ (Asia Cup) జరగాల్సి ఉండగా.. భారత్ జట్టుని అక్కడికి పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పేసింది. అయితే.. ఒకవేళ ఆసియా కప్-2023 కోసం భారత్ జట్టు పాక్ గడ్డపైకి రాకుంటే? ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కి పాక్ జట్టుని తాము పంపబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరిస్తోంది. ఈ బోర్డుల మధ్యలోకి దూరిన ఇరు దేశాల మాజీ క్రికెటర్లు కూడా మాటల యుద్ధానికి దిగుతున్నారు.
అసలు ఏంటి ఈ వివాదం అంటే? దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా పాకిస్థాన్‌కి భారత్ జట్టుని పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతించకపోవచ్చని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ ఆసియా కప్‌ని తటస్థ వేదికపై పాక్ నిర్వహిస్తే? తాము జట్టుని పంపుతామని బీసీసీఐ స్పష్టం చేసింది. కానీ.. ఇన్నాళ్లు భద్రతా కారణాలు చూపుతూ పాక్ గడ్డపైకి వెళ్లేందుకు నిరాకరించిన కొన్ని దేశాల జట్లు.. ఇటీవల పాక్‌లో పర్యటించాయి. దాంతో భారత్ జట్టు కూడా వస్తే? మళ్లీ క్రికెట్‌కి మునుపటి తరహాలో పాక్‌లో ఆదరణ పెరుగుతుందని పీసీబీ ఆశిస్తోంది. కానీ.. బీసీసీఐ మాత్రం ససేమేరా అంటోంది.
97640591
వాస్తవానికి గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ఈ దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఒకవేళ భారత్ జట్టు పాక్ గడ్డపైకి అడుగు పెడితే? అప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లకి కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. అదే జరిగితే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి గొప్ప ఊరట లభిస్తుంది. కానీ బీసీసీఐ రివర్స్‌లో స్పందిస్తుండటంతో తొలుత రిక్వెస్ట్ చేసిన పాక్ మాజీ క్రికెటర్లు ఆ తర్వాత హెచ్చరికలు దిగి.. ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తున్నారు.
97638720
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ తాజాగా ప్రైవేట్ ఈవెంట్‌లో మాట్లాడుతుండగా.. ఆసియా కప్ గురించి టాపిక్ వచ్చింది. దాంతో అతను ఘాటుగా విమర్శలు గుప్పించాడు. ‘‘పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ ఎందుకు భయపడుతోంది? ఒకవేళ పాకిస్థాన్ చేతిలో ఓడిపోతే భారత్ ప్రజలు వారిని ఉపేక్షించరు. ఆ విషయం వాళ్లకి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు. ఆసియా కప్ కోసం పాక్ గడ్డపైకి రాకపోతే.. భారత్ జట్టుని ఎక్కడికైనా వెళ్లమనండి. పాకిస్థాన్ క్రికెట్ మనుగడకి భారత్ సాయం అవసరం లేదు’’ అని మియాందాద్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు.