మహారాష్ట్రకు కేసీఆర్ ఆఫర్
నిర్మల్, వెలుగు: శ్రీరాంసాగర్ నీళ్లను మహారాష్ట్ర లిఫ్ట్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఏటా 2వేల నుంచి 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతోంటే ఒక్క టీఎంసీ కూడా ఆపలేని బాబ్లీ ప్రాజెక్టు గురించి లొల్లి అనవసరం.. ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లను సిరివంచ దగ్గర ఆపుకొని మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలకు తరలించవచ్చు.. శ్రీరాంసాగర్ నుంచి కూడా మహారాష్ట్రకు లిఫ్టు చేసుకోవచ్చు..’’ అంటూ ఆఫర్ ఇచ్చారు. ఏటా వేల టీఎంసీల గోదావరి నీళ్లు వృథాగా పోవడానికి రాష్ట్రాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలే కారణమని.. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కలిసి కూర్చొని గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. కాళేశ్వరం ద్వారా మూడేండ్లుగా గోదావరి నీళ్లు ఎత్తిపోస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని కేసీఆర్ఆరోపించారు. దేశంలో రెండేండ్ల కిందటి వరకు ఓ సాధారణ వ్యాపారిగా ఉన్న అదానీ నేడు దేశాన్ని ముంచి రూ. 80 వేల కోట్ల పెట్టుబడుల స్కామ్‌కు పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చించకుండా కేంద్రం అడ్డు తగులుతున్నదని, వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి చర్చించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
లండన్‌లో కరెంటు పోతది.. కానీ హైదరాబాద్‌లో పోదు
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, శాస్త్రీయంగా రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్నదే బీఆర్ఎస్ అభిమతమని చెప్పారు. మందిర్, మసీద్, చర్చిలన్నీ ఒక్కటే అన్నది తమ పార్టీ విధానమని అన్నారు. ప్రధానిగా మోడీని గుర్తించడం లేదని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలివి లేదని దుయ్యబట్టారు. ‘‘కేవలం 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం రాష్ట్రంగా కొనసాగుతున్నది. 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కూడా రాష్ట్రంగా ఉంది. ఇట్లా అశాస్త్రీయత కారణంగా అభివృద్ధి కుంటు పడుతున్నది. దేశంలో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత దేశ పరిస్థితిని చూసి బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా విస్తరించేందుకు ముందుకు వచ్చింది” అని తెలిపారు. విద్యుత్తు రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే జాతీయం చేస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 24గంటల పాటు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని, ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ సర్కారు ఏర్పడగానే వెలుగులు పంచుతామని అన్నారు. న్యూయార్క్, లండన్‌లో కరెంటు పోయినా హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోదని, ఇదీ తమ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాల మధ్య కోట్లాటలు లేని జల విధానాన్ని అమలు చేస్తామని, ప్రస్తుత నీటి పాలసీని రద్దు చేసి కొత్త వాటర్ పవర్ పాలసీని తయారు చేస్తామని అన్నారు. కేంద్రం తెచ్చిన ట్రిపుల్ తలాక్, అగ్రి చట్టాల బిల్లులను వ్యతిరేకించామని కేసీఆర్ చెప్పారు.
మహిళల కోసం కొత్త పాలసీ తెస్తం
మహిళల కోసం బీఆర్ఎస్ కొత్త పాలసీని రూపొందిస్తున్నదని, ప్రతీ అసెంబ్లీ, మండలిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. దేశంలో డి లిమిటేషన్ అమలు చేసి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సే స్థానాలను పెంచి, మహిళలకు కేటాయిస్తామన్నారు. దేశానికి మంచి నాయకుడు ఉంటే అమెరికాను మించి పోయి అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ప్రపంచ స్థాయి రిజర్వాయర్లను దేశంలో మరిన్ని నిర్మించాల్సి ఉందని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని చెప్పారు. ధర్మం, జాతి పేరుతో జనాలను వీడదీసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే రాజ్యాంగంలో కూడా సవరణలు చేస్తామన్నారు. బాబ్లీ ప్రాజెక్టు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగానే నిర్వహిస్తున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
©️ VIL Media Pvt Ltd.