వైజాగ్ ‌లో ఈ మార్పులు గమనించారా..? ఇదంతా ఎందుకోసమంటే..

Setti Jagadeesh, News 18, Visakhapatnam

మార్చి (March) నెలలో జరగనున్న జి-20 సదస్సునకు విశాఖపట్నం ముస్తాబవుతోంది. చేపట్టవలసిన అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి విచ్చేసిన రాష్ట్ర మునిసిపల్ శాఖ కార్యదర్శి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. విశాఖలో ఆమె, జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు, స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్, ఎ.పి. గ్రీన్ కార్పొరేషన్ ఎం.డి. రాజశేఖర రెడ్డి, డైరెక్టర్ అఫ్ కల్చర్ మల్లిఖార్జున, వి.ఎం.ఆర్.డి.ఎ. జాయింట్ కమిషనర్ వి.రవీంద్రలతో కలసి నగరంలో గల పలు ప్రధాన రోడ్ల నందు, సముద్ర తీర ప్రాంతాలలో పర్యటించారు.

ఈ పర్యటనలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.., జి-20 సదస్సునకు దెశ విదేశాల నుండి అధిక సంఖ్యలో అతిధులు, ప్రతినిధులు విశాఖనగరానికి విచ్చేయుచున్నందున, విశాఖపట్నం యొక్క ప్రత్యేకతను, సంస్కృతిని కనబరిచేటట్లు అద్భుతంగా వివిధ ఆకృతులతో కూడిన బొమ్మలతో, అలంకరణలతో, విద్యుత్ దీపాలంకరణలతో, రంగు రంగుల మోడరన్ పెయింటింగ్లతో, కల్చర్ ఆర్ట్ లతో, వివిధ ఆకృతులతో కూడిన మొక్కలు – చెట్లతో, పరిశుభ్రమైన రోడ్లతో, ఫుట్ పాత్ లతో, పారిశుధ్య పనులు నిరంతరంగా జరుపుతూ, విదేశాల నుండి వస్తున్న అతిధులకు విశాఖ నగరం అందాలతో అబ్బుర పరచేటట్లు ఆకర్షితంగా ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆమె ఆదేశించారు.

ఇది చదవండి: ఏకంగా 5వేల ఫోన్లు రికవరీ.. ఆ విషయంలో ఏపీ పోలీసులే ఫస్ట్..

ఈ పర్యటనలో ఆర్.కె. బీచ్, జోడుగుళ్ళపాలెం, సాగర్ నగర్ బీచ్ ప్రాంతాలలో పర్యటించి చేపట్టవలసిన సుందరీకరణ పనులు, అభివృద్ధి పనులపై జివిఎంసి కమిషనరు, ఇతర అధికారులతో చర్చించి త్వరితగతిన ఆయా పనులను పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. నగరంలో ఈ-ఆటోలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో గల డాక్టర్ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియం ప్రదేశాన్ని, ర్యాడిసన్ బ్లూ హోటల్ ప్రాంతాలను పర్యటించారు. నగరంలో వివిధ ప్రదేశాలందు అందమైన మొక్కలను ఏర్పాటు చేయవలసిందిగా ఎ. పి. గ్రీన్ కార్పొరేషన్ ఎం.డి. రాజశేఖర్ రెడ్డిని ఆమె ఆదేశించారు.

ఈ పర్యటనలో జీవిఎంసీప్రధాన ఇంజనీర్, అదనపు కమిషనర్లు డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి కెఎస్ఎల్జి శాస్త్రి, పట్టణ ప్రణాళికాదికారి సురేష్, డిప్యుటీ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ ఎం. దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు సత్యనారాయణ రాజు, వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, డిసిపిలు నరేంద్ర రెడ్డి, పద్మజ, సంజీవ్ రత్నకుమార్, ఎ.సి.పి. వెంకటేశ్వరరావు, ఎ.ఎం.ఒ.హెచ్. డాక్టర్ ఎన్ కిషోర్, తదితర అధికార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *