షార్ట్ సెల్లింగ్: కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు… లాభాలు ఎలా వస్తాయ్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం తరువాత స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అనేక పదాలు వినిపిస్తున్నాయి.

షార్ట్ సెల్లింగ్, స్టాక్ మానిప్యులేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎఫ్‌పీఓ, ఐపీఓ, షెల్ కంపెనీ లాంటి పదాలు వార్తలో కనిపిస్తున్నాయి.

అదానీ కేసు అర్థం కావాలంటే ఈ పదాలకు గురించి కాస్త తెలుసుకోవాలి.

షార్ట్ సెల్లింగ్

ఒక కంపెనీ షేర్ల ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయనే ఉద్దేశంతో వాటిని కొంటారు. అనుకున్నట్లుగా ధరలు పెరిగినప్పుడు ఈ షేర్లను అమ్మి, లాభాలు తీసుకుంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇలా జరుగుతుంది.

షార్ట్ సెల్లింగ్‌లో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.

షేర్ల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు లేదా మరేదైనా కారణంతో కొద్ది రోజుల్లో పడిపోవచ్చని భావించినప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తారు.

ఇక్కడ షేర్లు కొనడం ఉండదు.

స్టాక్ బ్రోకర్ నుంచి షేర్లను అప్పుగా తీసుకుంటారు. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమ్ముతారు. ఆ తరువాత షేర్ల ధరలు పడిపోయాక తిరిగి వాటిని కొంటారు.

అప్పు తీసుకున్న షేర్లను బ్రోకర్‌కు ఇచ్చేసి, లాభాన్ని జేబులో వేసుకుంటారు.

ఉదాహరణకు, X అనే కంపెనీ షేర్ల ధరలు పడిపోతాయని ఒక షార్ట్ సెల్లర్ ఊహించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ షేర్ ధర రూ.100 అనుకుందాం.

షార్ట్ సెల్లర్ 100 షేర్లను బ్రోకర్ నుంచి అప్పుగా తీసుకున్నారు. వాటిని రూ.100 దగ్గర అమ్మేశారు. అప్పుడు ఆ వ్యక్తి రూ.10 వేలు వస్తాయి.

కొన్నాళ్లకు X కంపెనీ షేర్ ధర రూ. 60కి పడిపోయింది. వెంటనే 100 షేర్లను రూ. 6000 పెట్టి ఆ వ్యక్తి కొంటారు. ఆ షేర్లను బ్రోకర్‌కు తిరిగి ఇచ్చేస్తారు.

అలా ఆ షార్ట్ సెల్లర్ చేతికి రూ. 4,000 వస్తాయి. చివరకు పన్నులు పోను మిగిలింది ఆ వ్యక్తి లాభం అవుతుంది.

ఈ ప్రక్రియనే షార్ట్ సెల్లింగ్ అంటారు.

ఇది చట్టబద్ధమే అయినా ఇందులో రిస్క్ ఎక్కువ. అనుకున్నట్టుగా షేర్ ధరలు పడిపోకుండా పెరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

షార్ట్ సెల్లింగ్ చేయాలంటే ట్రేడింగ్ మీద మంచి పట్టు ఉండటంతోపాటు షేర్ల కదలికల మీద లోతైన అవగాహన, టెక్నికల్ ఎనాలిసిస్ చేయగల సామర్థ్యం, మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాల మీద అవగాహన వంటివి చాలా ముఖ్యం.

అలాగే, నష్టాలను తట్టుకోగల శక్తి కూడా ఉండాలి.

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందా?
  • అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి

షార్ట్ సెల్లింగ్‌లో షేర్లు ఎందుకు కొనరు?

షేర్లు కొనాలంటే మార్కెట్ ధర ప్రకారం ఎన్ని కొంటారో అన్నింటికీ డబ్బు చెల్లించాలి. పై ఉదాహరణలో ఒక్కో షేరు రూ.100 చొప్పున 100 షేర్లు కొనాలంటే రూ.10 వేలు కావాలి.

కానీ ఇక్కడ అంత డబ్బు అవసరం లేదు. మార్జిన్‌గా కొంత అకౌంట్‌లో ఉంచితే సరిపోతుంది.

అంటే తక్కువ మార్జిన్‌తో ఎక్కువ షేర్లను షార్ట్ సెల్లింగ్‌లో అమ్మవచ్చు.

ఐపీఓ అంటే?

కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే ప్రక్రియలో తొలి దశనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అంటారు.

కంపెనీలోని కొంత వాటాను ప్రైమరీ మార్కెట్‌లో రిటైల్, సంస్థాగత మదుపర్లకు విక్రయిస్తారు.

ఇలా కంపెనీ మొదటిసారి షేర్లను విక్రయిస్తారు కనుక దాన్ని ఐపీఓ అంటారు. ఆ తరువాత బీఎస్ఈ, ఎన్‌ఎస్‌‌ఈలలో ఆ షేర్లు నమోదవుతాయి. వీటిని సెకండరీ మార్కెట్ అంటారు.

ఇక్కడ షేర్లను అమ్మడం, కొనడం చేయొచ్చు.

ఎఫ్‌పీఓ అంటే?

అప్పటికే స్టాక్ మార్కెట్‌లో ఉన్న లిస్టెడ్ కంపెనీ పెట్టుబడిదారులకు లేదా వాటాదారులకు కొత్త షేర్లను ఆఫర్ చేస్తుంది.

అంటే, అంతకు ముందే ఐపీఓ కింద షేర్లు విక్రయించిన కంపెనీ, మరిన్ని పెట్టుబడులు సేకరించడానికి లేదా రుణభారం తగ్గించుకోవడానికి మళ్లీ కొత్తగా షేర్లు విక్రయిస్తుంది. దీన్నే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) అంటారు.

చాలావరకు వీటిని కంపెనీ ప్రమోటర్లు జారీ చేస్తారు.

  • గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్… 10 రోజుల్లో 8 లక్షల కోట్లు మాయం
  • క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి రూ. 4,690 కోట్లు కొట్టేశారు

షెల్ కంపెనీ

షెల్ కంపెనీ (డొల్ల కంపెనీ).. ఇది కాగితంపై మాత్రమే ఉంటుంది కానీ, ఎలాంటి వ్యాపారం చేయదు.

భారతదేశంలో షెల్ కంపెనీని కలిగి ఉండటం చట్టవిరుద్ధం కాదు. అనేక వ్యాపార ప్రయోజనాలకు దీన్ని చట్టబద్ధంగా ఉపయోగించవచ్చు.

అయినప్పటికీ, తరచుగా షెల్ కంపెనీలను పన్నులు ఎగ్గొట్టడానికి, స్టాక్‌ మానిప్యులేషన్ లాంట చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగిస్తారు.

అయితే, చట్టబద్ధమైన ప్రయోజనాలకూ ఉపయోగిస్తారు. వ్యాపార యాజమాన్యం చేతులు మారినప్పుడు పేరును రహస్యంగా ఉంచడానికి, పబ్లిక్ లిస్టింగ్‌లో పేరు దాచడానికి కూడా వాడతారు.

స్టాక్ మానిప్యులేషన్

ఒక షేరు ధర దాని సప్లయి, డిమాండ్ బట్టి నిర్ణయమవుతుంది. ఇది మార్కెట్లో జరిగే సహజ ప్రక్రియ.

అమ్మేవాళ్ల కన్నా కొనాలనుకునేవళ్లు ఎక్కువ ఉంటే.. అంటే సప్లయి కన్నా డిమాండ్ ఎక్కువ ఉంటే షేర్ ధర పెరుగుతుంది.

కంపెనీ స్థాయి, విశ్వసనీయత, నిర్వహణ సామర్థ్యం బట్టి డిమాండ్ పెరగడం, తగ్గడం ఉంటుంది. ఒక కంపెనీ బాగా పనిచేస్తున్నా లేదా భవిష్యత్తులో బాగా పనిచేస్తుందని నమ్మకం కలిగించినా ఆ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు షేర్ ధర పెరుగుతుంది.

ఇలా కాకుండా, ఉద్దేశపూర్వకంగా సప్లయి, డిమాండ్‌లను పెంచడం, తగ్గించడం చేస్తే నాటకీయంగా షేర్ల ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. ఇదెలా సాధ్యమవుతుందంటే, కంపెనీ గురించి ఫేక్ న్యూస్, తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయడం లేదా ఊరికే సప్లయి, డిమాండ్ పెంచడానికి, తగ్గించడానికి అవసరం లేకపోయినా షేర్లను అమ్మడం, కొనడం.. అంటే కృతిమంగా షేర్ ధరలకు ప్రభావితం చేయడం. దీన్ని ట్యాంపరింగ్ లేదా రిగ్గింగ్ అంటారు. దీన్నే స్టాక్ మానిప్యులేషన్ లేదా మార్కెట్ మానిప్యులేషన్ అని కూడా అంటారు.

ఇది చట్టవిరుద్ధం. కానీ, దీన్ని కనిపెట్టి చట్టానికి పట్టించడం చాలా కష్టం. పట్టుకున్నా, నిరూపించడం ఇంకా కష్టం. షెల్ కంపెనీలు, నీతినియమాలు లేకుండా పనిచేసే బ్రోకర్ల ద్వారా ఈ మానిప్యులేషన్ చేస్తారు.

  • గౌతం అదానీ రూ. 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది?
  • అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాల నుంచి మన పెట్టుబడిని ఎలా రక్షించుకోవాలి?

మార్కెట్ క్యాపిటలైజేషన్

ఒక కంపెనీ మొత్తం షేర్ల విలువే కంపెనీ విలువ అవుతుంది. కంపెనీ దగ్గర ఉన్న షేర్ల సంఖ్యను, షేర్ ధరతో గుణిస్తే కంపెనీ విలువ వస్తుంది.

ఉదాహరణకు, ఒక కంపెనీ వద్ద 10 కోట్ల షేర్లు ఉన్నాయి. ఒక్కొక్క షేర్ ధర రూ. 100. అప్పుడు ఆ కంపెనీ మర్కెట్ విలువ రూ. 1000 కోట్లు అవుతుంది.

పెట్టుబడిదారులు ఒక కంపెనీ మార్కెట్ విలువ బట్టి అందులో షేర్లు కొంటే లాభమా, నష్టమా అంచనా వేస్తారు.

షేర్ ధర పెరిగినా, తగ్గినా కంపెనీ మార్కెట్ విలువ మారిపోతుంది. అలాగే, కంపెనీ షేర్ల సంఖ్యను పెంచితే కూడా మార్కెట్ విలువ మారిపోతుంది.

  • వేణుగోపాల్ ధూత్: ఇంటింటికీ కలర్ టీవీని తీసుకెళ్లిన వీడియోకాన్ ఎలా ‘పతనమైంది’?
  • డాలర్ ఎందుకు ఇంతలా బలపడుతోంది, ఇది రూపాయికి ముప్పేనా

మార్కెట్ విలువ సడన్‌గా పడిపోతే ఏమవుతుంది?

కంపెనీలు తమ మార్కెట్ విలువను ముందుపెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి.

కంపెనీ మార్కెట్ విలువ పడిపోతే, నష్టాలను పూడ్చడానికి అదనపు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

టాక్స్ హెవెన్ అంటే ఏమిటి?

ఏదైన ఒక దేశం లేదా స్వతంత్ర భూభాగంలో విదేశీ కంపెనీలు, లేదా వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే లేదా అతి తక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే, అది పన్ను చెల్లింపుదారులకు స్వర్గధామం కింద లెక్క. అందుకే అలాంటి దేశాలను టాక్స్ హెవెన్ అంటారు.

టాక్స్ హెవెన్స్ చట్టబద్ధమే. కానీ, కొన్ని కంపెనీలు లేదా సంపన్నులు ఈ అవకాశాన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారు.

పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, మోసం మొదలైన అవివీతి పనులకు టాక్స్ హెవెన్ దేశాలను ఉపయోగించుకుంటారు.

ఇవి కూడా చదవండి:

  • అమెరికా: చైనా ‘స్పై బెలూన్‌’ను మిసైల్ ప్రయోగించి అట్లాంటిక్ సముద్రంలో కూల్చేసిన యూఎస్
  • ఆంధ్రప్రదేశ్: విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్‌తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి?
  • ‘స్వాగత తిలకం’ వద్దన్న ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. వారిపై ట్రోలింగ్ ఎందుకు?
  • బడ్జెట్ 2023: విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రస్తావన ఏదీ?
  • ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు గుజరాత్‌కు ఎందుకు వలస పోతున్నారు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *