స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాన్ని అదుపుచేసి పెను ప్రమాదం తప్పించిన బాలిక

విద్యార్థులను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్తోన్న బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ సమయంలో సయస్ఫూర్తి ప్రదర్శించిన ఓ విద్యార్ధిని.. పెను ప్రమాదం నుంచి బస్సులోని విద్యార్థులను బటయపడేసింది. బాలిక తెలివిగా వ్యవహరించి స్తంభానికి ఢీకొట్టి బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బస్సులోని విద్యార్థులంతా బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌‌లోని రాజ్‌కోట్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే నగరంలోని ట్రాంబా వద్ద ఉన్న భరద్‌ పాఠశాలకు చెందిన బస్సు.. శనివారం సాయంత్రం విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తోంది. పాఠశాల వార్షికోత్సవం కావడంతో సాయంత్రం 6.30 గంటలకు బస్సులో విద్యార్థులకు బయలుదేరారు. ఈ బస్సు గొండాల్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవరు హరున్భాయ్ ఖిమానీ‌ గుండెపోటుకు గురయ్యాడు. మెలికలు తిరిగిపోయిన డ్రైవర్.. బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదుపుతప్పిన వాహనం.. డివైడర్‌ దాటిన ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటూ పోయింది.

దీనిని గమనించిన డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న భార్గవి వ్యాస్‌ అనే విద్యార్థిని (17).. భయపడిపోయింది. వెంటనే తేరుకుని స్టీరింగు పట్టుకుని బస్సును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ‘‘నేను డ్రైవరు పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాను. బస్సు గొండాల్‌ రోడ్డులోని మక్కమ్ కూడలి వద్దకు చేరుకోగానే.. డ్రైవర్‌ మాటలు తడబడ్డాయి.. ఆయన నోరు ఒకవైపునకు వచ్చేసి.. ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగు వదిలేసి ఒక పక్కకు కూలబడిపోయారు.. ఆయన పరిస్థితిని గమనించి నేను వెంటనే స్టీరింగు తిప్పి బస్సును కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆపాను’ అని భార్గవి వివరించింది.

గుండెపోటుకు గురైన డ్రైవర్‌ హారున్‌భాయ్‌‌ను అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్గవి సమయస్ఫూర్తిని జనం కొనియాడుతున్నారు. చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు కాపాడిందని అంటున్నారు. భార్గవి తల్లి మాట్లాడుతూ… మాకు ఒక కుమార్తె ఉంది, కానీ మేము ఆమెను కొడుకుగానే భావిస్తాం.. ఆడపిల్ల, అబ్బాయి అనే బేధం చూపొద్దని అన్నారు.

Read Latest National News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *