Bhadradri Kothagudem: ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పొంగులేటి

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి కొత్తగూడెం

ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి దూకుడు పెంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తన వర్గాన్ని మరింత బలోపేతం చేస్తూ అధికార టిఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఒకవైపు జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ఏ పార్టీలో చేరతారని స్పష్టం చేయకుండానే పార్టీ కార్యాలయాలను ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు.

ఇక రెండు నెలల నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ధిక్కారస్వరం వినిపిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డి రోజుకో సంచలనానికి కేంద్రంగా నిలుస్తున్నారు. తాజాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం అభ్యర్థిగా బానోత్ విజయబాయి పోటీ చేస్తారని మరో సంచలన ప్రకటన చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

బీఆర్ఎస్ ను వీడుతారని వార్తలు వెలువడుతున్న సమయంలో.. అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. దీన్నిబట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఫిబ్రవరి 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గం అభ్యర్థిగా విజయబాయి పోటీలో ఉంటారని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం సీపీఐ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయబాయి.. తన వర్గంలో చేరారని తెలిపారు. లెఫ్టేడియాలజీ కలిగిన సీనియర్ నేత ధర్మన్న కుమార్తె తమ వర్గంలోకి రావడం హర్షించదగిన పరిణామమన్నారు.

రాజకీయాల్లో ప్రవేశించింది మొదలు తనకు వైరా నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉందని, విజయబాయి చేరికతో ఆ అనుబంధం మరింత బలపడిందన్నారు. వైరాలో తమకున్న బలమైన క్యాడర్ ద్వారా విజయబాయిని గెలిపించుకుంటామన్నారు. ఇదిలా ఉండగా విజయబాయి మాట్లాడుతూ.. పొంగులేటి శీనన్నతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని అన్నారు.

తనపై నమ్మకం ఉంచి తన వర్గ అభ్యర్థిగా వైరాలో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్న పొంగులేటికి రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జూలూరుపాడు సొసైటీ చెర్మన్ లేళ్ల వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *