IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన సంస్ధల్లో ఐటీ సోదాలు సోమవారం ముగిశాయి. దాదాపు ఆరు రోజుల పాటు ఆయనకు చెందిన వివిధ సంస్థల్లో తనిఖీలు జరిగాయి. ఆయనకు సంబంధించిన రాజ్ పుష్ప, ముప్పాలతో పాటు ఇతర వ్యక్తుల సంస్థలైన వెర్టిక్స్, వసుధ ఫార్మా కోమికల్స్ సంస్థలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.
ఈ ఐటీ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో స్థలాల కొనుగోలు, అమ్మకాలలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని ప్లాట్ కొనుగోలుదారుల వద్ద నుంచి తీసుకున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. బ్లాక్ మనీ మొత్తాన్ని పలు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టారని, ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.
పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా.. వీటి ఆధారంగా వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఏకకాలంలో ఒకేసారి వెంకట్రామిరెడ్డి ఇళ్లతో పాటు సంస్ధల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం బీఆర్ఎస్‌లో కలకలం రేపింది. వెంకట్రామిరెడ్డి పీఎ నరేందర్ రెడ్డి ఇంటితో పాటు ఆయన సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న వారి ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు. వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లల్లో కూడా సోదాలు జరిపినట్లు చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేశారు. అయితే పదవీకాలం ఇంకా మిగిలి ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని పొలిటికల్ ఇంట్రీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా ఆయన కప్పుకోగా.. వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ కాళ్లకు ఆయన మొక్కడంపై రాజకీయం దుమారం రేగింది. ఐఏఎస్ అయి ఉండి కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం ఏంటని ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శలకు దిగాయి. అయినా ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోని బీఆర్ఎస్.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్‌కు వెంకట్రామిరెడ్డి వీరవిధేయుడనే ప్రచారం టీ పాలిటిక్స్‌లో బలంగా ఉంది. ఇలాంటి క్రమంలో వెంకట్రామిరెడ్డిపై ఐటీ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.