Telangana Budget: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారి జీతం పెంపు

Telangana Budget: బడ్జెట్‌లో ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపడుతున్నట్లు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మధ్యాహ్నం భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచి సెర్చ్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానం తీసుకొస్తామన్నారు. ఉద్యోగుల కోసం ఎంప్లాయూస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. వర్సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కోసం రూ.750 కోట్లు, మూసీ రివర్స్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు, యాదాద్రి ఆలయం అభివృద్ది కోసం రూ.200 కోట్లు కేటాయించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ పథకం కోసం రూ.200 కోట్లు, వరంగల్‌లో రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు చెప్పారు.

కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.వెయ్యి కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు, న్యాయశాఖకు రూ.1665 కోట్లు, హరితహారం పథకానికి రూ.1471 కోట్లు, ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు కేటాయించారు. అయితే తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యూలర్ చేస్తామని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీని కోసం అధికారులు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటివరకు ముందుకు అడుగులు పడలేదు. ఇప్పుడు బడ్జెట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. త్వరలోనే రెగ్యూలర్ చేసే ప్రక్రియ చేపట్టే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *