Turkey earthquake today : టర్కీలో వచ్చిన అతి భారీ భూకంపంలో 15 మంది చనిపోయినట్లు తెలిసింది. వందల మంది కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐతే.. భారీ భూకంపం తర్వాత మరిన్ని ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల ప్రజలు ఇళ్లలోకి వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ఆగ్నేయంగా ఉన్న నర్దాగి (Nurdagi)లో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే (USGS) గుర్తించింది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు గుర్తించారు. నర్దాగీకి 26 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు అమెరికా సంస్థ USGS గుర్తించింది. ఈ నర్దాగి అనేది గజియాంటెప్ ప్రావిన్స్‌లోని జిల్లా, సిటీగా ఉంది. ఇది గజియాంటెప్‌కి పశ్చిమంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భూకంప తీవ్రతకు నర్దాగీ సహా చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పక్కనే ఉన్న సిరియాలోనూ ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసింది. టర్కీతోపాటూ.. సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది. టర్కీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని బట్టీ భూకంపం మిగిల్చిన నష్టం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
భూకంప బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా ఈ భూకంపం నుంచి కోలుకొని… తక్కువ నష్టం కలిగేలా చేద్దామని ఆయన పిలుపిచ్చారు.
ఆగ్నేయ టర్కీలో చాలా భవనాలు కూలిపోయాయి. అక్కడే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.