Second Powerful Earthquake Hits Turkey : తుర్కియా(టర్కీ)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంపం టర్కీని కుదిపేసింది(Turkey earthquake). సోమవారం తెల్లవారుజాము 4:17 గంటల సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీకి ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెస్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటికే 1600 మందికిపైగా మరణించారు. సిరియాలోని తిరుగుబాటుదారులు మరియు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 700 మంది మరణించారని స్థానిక మీడియా, వైద్య వర్గాలు తెలిపాయి. టర్కీలో 900మందికి పైగా మరణించారని సమాచారం. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిరియా జాతీయ భూకంప కేంద్రం అధిపతి రేద్ అహ్మద్ దీనిని ” చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం” అని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న వేలాదిమందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలోనే మధ్యాహ్నం ఆగ్నేయ టర్కీలో రెండోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.24 గంటలకు ఎకినోజు పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరోసారి భూకంపం సంభవించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Earthquake Predictor: భూకంపం వస్తుందని మూడు రోజులే ముందే చెప్పాడు! అతనికి ఎలా తెలుసు..?
ఈ రెండు భూకంపాల కారణంగా మృతుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక, టర్కీ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఏడు నగరాలపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. టర్కీలో సంభవించిన భూకంపం దాటికి అనేక భవనాలు నేలకూలాయి. టర్కీలోని ఉస్మానియాలో 34 భవనాలు ధ్వంసమయ్యాయి. సిరియాలోని పశ్చిమ తీర ప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటికే వేలాది మంది గాయాలపాలవగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు మూడుకోట్ల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.