US Visa: అమెరికా వీసా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది.. కొత్త రూల్‌ బెనిఫిట్స్ ఇవే..!

కొన్ని సంవత్సరాల క్రితం చాలా తక్కువ మంది మాత్రమే ఇతర దేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా (India) నుంచి యూఎస్ (USA) వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అక్కడకు వెళ్లాలంటే వీసా (Visa) తప్పనిసరి. గతంలో వీసా రావడమనేది ఓ ప్రహసనంగా ఉండేది. ప్రయాణికులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని నిబంధనలు సడలించారు. అయినా సరే కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రోజుల వ్యవధిలోనే వీసా మంజూరు చేసేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దీంతో యూఎస్ వెళ్దామనుకునే చాలామందికి ఊరట లభించింది. ఆ రూల్స్ ఏమిటి, ఎవరి కోసం, ఎన్ని రోజుల్లో వీసా వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

* గతంలో ఇదీ పరిస్థితి

యూఎస్ వెళ్లడానికి నెలలపాటు ఎదురుచూపులు తప్పేవి కావు. వీసా మంజూరు చేయడానికి ముంబాయిలో 638 రోజులు, కోల్‌కతాలో 589 రోజులు, ఢిల్లీలో 596 రోజులు, హైదరాబాద్‌లో 609 రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. అన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా 14 రోజుల్లో ఇంటర్వ్యూ దశకు చేరుకుని, ఆపై వీసా పొందేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు యూఎస్ అంబసీ ప్రకటించింది.

* ఎవరి కోసం

వ్యాపారం, పర్యాటకం లేదా యూఎస్‌లో ఉండే తమవారిని చూసేందుకు చాలామంది కొన్ని రోజుల గడువుతో వెళ్లేవారికి బీ1, బీ2 (B1, B2) వీసాలు మంజూరు చేస్తారు. ప్రస్తుతం వీరికి మాత్రమే తక్కువ టైంలో వీసా పొందే అవకాశం ఉంది. బీ1, బీ2 విసాల మంజూరు గడువు సమయాన్ని తగ్గించేందుకు యూఎస్ ఎంబసీ గత నెలలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

అందులో ఏయే అంశాలు ఉన్నాయంటే.. ఢిల్లీలోని అంబసీ, ముంబాయి, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్లో ఉన్న కాన్సులేట్స్లో ఇకపై శనివారం నాడు ఇంటర్వ్యూలు నిర్వహించడం. ఇప్పటికే వీసా ఉన్నవాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకుంటే వారికి ఇంటర్వ్యూను మినహాయింపు ఇవ్వడం. మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం. అందుకు తగిన విధంగా కొత్త స్టాఫ్ ను నియమించుకోవడం.

ఇది కూడా చదవండి : 20% ఇథనాల్‌ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ.. అందుబాటులోకి వచ్చిన ప్రాంతాలివే..

* అక్కడైనా తీసుకోవచ్చు

విదేశాల్లో ఉన్న భారతీయులు బీ1, బీ2 వీసా పొందేందుకు ఇకపై ఇండియాకు రావక్కర్లేదు. ఆ దేశంలోనే ఉన్న అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయం వద్ద పొందవచ్చు. వీసా మంజూరులో తీవ్ర జాప్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీని ప్రకారం బీ1, బీ2 వీసాల కోసం వేరే దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. కాగా మరికొన్ని రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇండియాలో అదనంగా 2,50,000 అదనపు బీ1, బీ2 వీసాలకు సంబంధించి అపాయింట్‌మెంట్‌లు రిలీజ్ చేసినట్లు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *