Man Shot At By Police : కర్ణాటకలోని కలబురిగి(Kalaburagi)లోని రద్దీ మార్కెట్‌లో ఓ యువకుడు కత్తిలో హల్‌చల్ చేశాడు. మార్కెట్ ప్రాంతం మధ్యలో నిలబడి స్థానికులకు కత్తి చూపిస్తూ నానా హంగామా చేశాడు. వారిపై దాడికి యత్నించాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు చంపేస్తానంటూ స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి లొంగిపొమ్మని ఆదేశించారు. అయితే పోలీసుల హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా యువకుడు వీరంగం చేశాడు. పైగా వాళ్లపై కూడా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
దీంతో పోలీసులు అతడి కాళ్లపై తుపాకితో కాల్చారు. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే తమ లాఠీలకు పనిచెప్పారు. కిందపడిన దుండగుడిపై లాఠీలతో దాడిచేసి చావబాదారు. బూటు కాళ్లతో తన్నారు. తర్వాత ఆ యువకుడిని తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Pm Modi: కర్ణాటకలో హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోదీ
నిందితుడిని జాఫర్‌గా గుర్తించామని, కాళ్లకు తూటా గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలబురిగి నగర పోలీసు కమిషనర్ చేతన్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపనున్నట్లు తెలిపారు. స్వీయరక్షణతోపాటు ప్రజల రక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపినట్టు తెలిపారు.