Video: 6,6,6,6,6,6.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. మంత్రిగారికి ముచ్చెమటలు

అప్పటివరకు స్లో బ్యాటింగ్ చేశాడు.. 42బంతులు ఆడితే కానీ హాఫ్‌ సెంచరీ పూర్తికాలేదు. వికెట్‌ పడకుండా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. టీమ్‌ స్కోర్‌ కూడా ఓ మాదిరిగా ఉంది. ఆ స్కోర్‌తో టీ20 మ్యాచ్‌ గెలవడం కష్టం.. 150-160 పరుగులు.. ఓ టీ20 మ్యాచ్‌లో ఛేజ్‌ చేయడం చాలా సింపుల్‌ థింగ్‌. అయితే ఆ బ్యాటర్ మనసులో వేరే ఆలోచన ఉంది. ఆకలిగొన్న పులిలా లాస్ట్‌ ఓవర్‌ వరకు వెయిట్ చేశాడు.. లాస్ట్ ఓవర్‌ ఫస్ట్ బాల్ పడిందో లేదో బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు.. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు… ఇలా ప్రతి బంతి గాల్లో ఎగురుతూ స్టాండ్స్‌లోనే పడింది. ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ మొత్తం తారుమారు.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ సీన్‌ జరిగింది. ఇంతకీ ఈ ఆరు సిక్సుల వీరుడెవరు..? కొట్టించుకున్న బాధిత బౌలర్‌ ఎవరు..? ఇందులో మంత్రిగారి టాపిక్‌ ఎందుకొచ్చింది..? ఎవరా మంత్రి..?

వహాబ్ రియాజ్‌కు చుక్కలు.. ఇఫ్తికార్‌ మెరుపులు:

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పాక్‌ ప్లేయర్‌ ఇఫ్తికార్ అహ్మద్ తన పేరును రికార్డు చేసుకున్నాడు. పెషావర్ జాల్మీతో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఈ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో హర్ష్‌లే గిబ్స్, యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, అమెరికాకు చెందిన జాస్కరన్ మల్హోత్రా మాత్రమే ఓకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో సర్ గ్యార్‌ఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రి, రాస్ వైట్లీ, హజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్, తిశారా పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదారు. గత ఏడాది నవంబర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఏడు సిక్సులు బాదగా.. ఇప్పుడా లిస్ట్‌లో ఇఫ్తికార్‌ వచ్చి చేరాడు. వ‌హాబ్ రియాజ్ వేసిన ఇన్నింగ్స్‌ లాస్ట్‌ ఓవ‌ర్‌లో ఆరు బాల్స్‌లో ఆరు సిక్స‌ర్లు కొట్టాడు. 42 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీని టచ్‌ చేసిన ఇఫ్తికార్‌ చివ‌రి ఓవ‌ర్‌లో మాత్రం వీరబాదుడు బాదాడు. ఇఫ్తికార్ బ్యాటింగ్ మెరుపుల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గత వారమే వహాబ్ రియాజ్‌కు క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు:

ఈ మ్యాచ్‌లో లాస్ట్‌ ఓవర్‌ బౌలింగ్‌ వేసిన పాక్‌ బౌలర్‌ వహాబ్‌ రియాజ్‌ను గత వారమే కీలక బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్, క్రీడ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. వహాబ్ రియాజ్ చివరిసారిగా 2020లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతను 27 టెస్టులు, 92 వన్డేలు, 36 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 103 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు అతని బౌలింగ్‌నే ఇఫ్తికార్‌ చీల్చి చెండాడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *