అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది… మరి లాభపడింది ఎవరు?

Click here to see the BBC interactive

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల గౌతమ్ అదానీకి సుమారు పది లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే, ఈ డబ్బులన్నీ ఆయన జేబు నుంచి పోలేదు. కానీ, గతవారం రోజుల్లో ఆయన ఆస్తి విలువ బాగా పడిపోయింది.

అంతకుముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న అదానీ వారం రోజుల్లో కిందకు పడిపోయారు. శుక్రవారం సాయంత్రానికి రెండు వేర్వేరు జాబితాలలో ఆయన స్థానం 17, 22గా నమోదైంది.

శని, ఆదివారాల్లో మార్కెట్ సెలవు. మళ్లీ సోమవారం మార్కెట్ తెరుచుకున్నప్పుడు, అదానీ గ్రూపుకు చెందిన పలు కంపెనీల షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు కొనసాగాయి.

అయితే, అదానీ గ్రూప్ షేర్ హోల్డర్లకు ఇంత భారీ నష్టం వాటిల్లడం వల్ల ఎవరికి లాభం? ఇదీ పెద్ద ప్రశ్న.

హిండెన్‌బర్గ్ నివేదిక ప్రారంభంలోనే ఒక విషయం స్పష్టంచేసింది.. తమ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు తెలిపింది. ఇది, అమెరికా మార్కెట్‌లో బాండ్ ట్రేడింగ్ ద్వారా, ‘డిరైవేటివ్ ఇన్స్ట్రుమెంట్స్’ ద్వారా చేసి ఉండవచ్చు.

షార్ట్ పొజిషన్, షార్ట్ సెల్లింగ్ లేదా షార్టింగ్.. ఇవన్నీ ఒకటే.

 • అదానీ ఎంటర్-ప్రైజెస్- ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందా-
 • గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్-బర్గ్ ఎఫెక్ట్… 10 రోజుల్లో 8 లక్షల కోట్లు మాయం

షార్ట్ పొజిషన్ లేదా షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి?

ఒక కంపెనీ షేర్ల ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయనే ఉద్దేశంతో వాటిని కొంటారు. అనుకున్నట్లుగా ధరలు పెరిగినప్పుడు ఈ షేర్లను అమ్మి, లాభాలు తీసుకుంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇలా జరుగుతుంది.

షార్ట్ సెల్లింగ్‌లో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. షేర్ల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు లేదా మరేదైనా కారణంతో కొద్ది రోజుల్లో పడిపోవచ్చని భావించినప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తారు.

ఇక్కడ షేర్లు కొనడం ఉండదు. స్టాక్ బ్రోకర్ నుంచి షేర్లను అప్పుగా తీసుకుంటారు. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమ్ముతారు. ఆ తరువాత షేర్ల ధరలు పడిపోయాక తిరిగి వాటిని కొంటారు.

అప్పు తీసుకున్న షేర్లను బ్రోకర్‌కు ఇచ్చేసి, లాభాన్ని జేబులో వేసుకుంటారు.

అప్పుగా తీసుకున్న షేర్లు లేదా బాండ్లను తిరిగే ఇచ్చే ఒప్పందానికి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది.

ఇలాంటి ఒప్పందాలను ‘వాయిదా ఒప్పందాలు’ అని కూడా అంటారు. ఇక్కడ విక్రేత నిర్దిష్ట తేదీలో నిర్దిష్ట ధరకు విక్రయిస్తానని, కొనుగోలుదారు అదే తేదీన అదే ధరకు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేస్తారు.

వాస్తవంలో డీల్ జరిగిన రోజు ధర తగ్గితే అమ్మకపుదారుడు లాభపడతాడు. ధర పెరిగితే కొనుగోలుదారుడు లాభపడతాడు. ఫ్యూచర్స్ మార్కెట్ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ ఈ విధంగా పనిచేస్తుంది.

ఉదాహరణకు, 100 షేర్లను ఒక్కొక్కట్టి రూ. 100 చొప్పున ఫిబ్రవరి 10వ తేదీన అమ్ముతానని, వాటిని అదే తేదీన అదే ధరకు కొంటానని ఒప్పందం చేసుకుంటారు. ఈ లావాదేవీ ఫిబ్రవరి 10న కాకుండా, 20వ తేదీన జరగవచ్చు. కానీ, ధరలు 10వ తేదీ ధరలే ఉంటాయి. 20వ తేదీన షేర్ ధర రూ. 80కి తగ్గితే అమ్మకపుదారుడు లాభపడతాడు. షేర్ ధర రూ. 120 కి పెరిగితే కొనుగోలుదారుడు లాభపడతాడు.

అయితే ఈ షార్ట్ సెల్లింగ్‌లో రెండు రకాలు ఉన్నాయి. కవర్డ్ షార్ట్, అన్‌కవర్డ్ షార్ట్ లేదా నేకెడ్ షార్ట్.

 • గౌతం అదానీ రూ. 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్-ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది-
 • గౌతమ్ అదానీ- 25 ఏళ్ల క్రితం గుజరాత్-లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు- అప్పుడు ఏం జరిగింది-

నేకెడ్ షార్ట్ అంటే ఏమిటి?

నేకెడ్ షార్ట్ సెల్లింగ్ అంటే అమ్మకపుదారుడు షేర్లను అప్పుగా తీసుకోకముందే ఒప్పందంలోకి దిగడం. అప్పు తీసుకుంటానని ఎలాంటి నమ్మకం చూపించకుండా లావాదేవీకి పూనుకోవడం. ఇది చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం.

అనుకున్న కాలానికి ఈ లావాదేవీ పూర్తికాకపోవచ్చు. భారీ నష్టాలు చవిచూడవచ్చు.

అందుకే 2007 తరువాత నేకెడ్ షార్ట్ సెల్లింగ్‌ను భారతదేశంలో నిషేధించారు.

హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపులో షార్ట్ సెల్లింగ్ వల్ల నష్టపోయిందా?

షార్ట్ సెల్లింగ్‌లో, షేర్ల ధరలు రాన్నున్న రోజుల్లో పడిపోతాయని ఊహించి ట్రేడింగ్ చేస్తారు. కానీ, ధరలు పడిపోకవచ్చు. బాగా పెరగవచ్చు.

గత మూడేళ్లుగా అదానీ గ్రూపు షేర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వేగంగా కూడా పెరిగాయి. అలాంటప్పుడు, అదానీ గ్రూపు కంపెనీల షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ చేసిన అమ్మకపుదారుడు ఎంత నష్టపోతాడో మీరే లెక్కించి చూడవచ్చు.

హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపులో షార్ట్ పొజిషన్‌లో ఉన్నట్టు నివేదికలో చెప్పింది.

అయితే, అదానీ, హిండెన్‌బర్గ్ కేసు ఇంకొంచం క్లిష్టంగా ఉంది.

 • అదానీ గ్రూప్- ఆ నివేదిక అంతా అబద్ధం; ‘అయితే, కోర్టులో తేల్చుకుందాం’ అని సవాలు విసిరిన హిండెన్-బర్గ్
 • ఆక్స్-ఫామ్ నివేదిక- ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్- సంపద

అదానీ షేర్ ధరలను పడగొట్టడానికి హిండెన్‌బర్గ్ ఏం చేసింది?

హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. ఈ పేరు వినగానే, ఇది ఒక పెద్ద పరిశోధన సంస్థ అనుకుంటాం. కానీ, కాదు. అదొక షార్ట్ సెల్లర్. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా చెప్పింది.

అది కూడా ‘యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్’ అనే ప్రత్యేక రకం.

షార్ట్ సెల్లింగ్ చేసేవారు వారి దగ్గర ఉన్న సమాచారం, మార్కెట్ వాతావరణం మొదలైనవాటిని లోతుగా పరిశీలించి ట్రేడింగ్‌లోకి దిగుతారు. దాని నుంచి అత్యధిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు అక్రమాలకు పాల్పడే కంపెనీల కోసం నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాంటి కంపెనీలను పట్టుకుని, వాటి డొల్లతనాన్ని బయటపెట్టి షేర్ల ధరలు పడిపోయేలా చేస్తారు.

దీనికొక పద్ధతి ఉంటుంది. యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు ముందు కంపెనీలపై పరిశోధన చేస్తారు. ఏదైనా ఒక కంపెనీలో అవకతవకలు ఉన్నాయని తెలియగానే, ఆ కంపెనీ షేర్లపై షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఆ తరువాత, కంపెనీపై తమ పరిశోధనా పత్రాన్ని పబ్లిక్‌లో విడుదల చేస్తారు. దాంతో, ఆ కంపెనీ షేర్ల ధరలు పడిపోతాయి. దాని నుంచి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు ప్రయోజనం పొందుతారు.

అదానీ గ్రూపుతో హిండెన్‌బర్గ్ చేసింది ఇదే. రెండేళ్ల పాటు తాము అదానీ వ్యాపారాన్ని నిశితంగా పరిశీలించామని, అదానీ గ్రూపుకు సంబంధించిన వాస్తవాలు, పత్రాలను పరిశోధించామని పేర్కొన్నారు.

కానీ, హిండెన్‌బర్గ్‌కు భారతీయ మార్కెట్లో అదానీ కంపెనీలలో షార్ట్ సెల్లింగ్ చేయడం అంత సులభం కాదు.

దీనిపై అమెరికాకు చెందిన ఇతర షార్ట్ సెల్లర్లు విస్తుపోతున్నారని, హిండెన్‌బర్గ్ నిజానికి ఎలాంటి ట్రేడింగ్ చేసింది? ఎలా చేసింది? తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాయిటర్స్ ఒక కథనంలో తెలిపింది. ఎందుకంటే, విదేశీయులకు భారతీయ కంపెనీలలో షార్ట్ సెల్లింగ్ చేయడం చాలా కష్టం.

దీనికి ఒక కారణం, 2007లో షార్ట్ సెల్లింగ్‌పై సెబి తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. మరొక కారణం, విదేశీ సంస్థలకు తమ షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్‌కు సంబంధించిన సమాచారం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది హిండెన్‌బర్గ్ వంటి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్‌కు కష్టం.

యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు తాము టార్గెట్ చేసే కంపెనీలో షార్ట్ సెల్లింగ్ చాలా రహస్యంగా చేయాల్సి ఉంటుంది. ఈ విషయం బయటికొస్తే వెంటనే ఆ కంపెనీ షేర్ల ధరలలో భారీ పతనం ఉంటంది. ఇది షార్ట్ సెల్లర్‌కు మంచిది కాదు.

అందుకే వాళ్ల ట్రేడింగ్ పూర్తయ్యేవరకు ఈ విషయన్ని రహస్యంగా ఉంచాలి.

హిండెన్‌బర్గ్ స్వయంగా చెప్పిన వివరాల ప్రకారం, ఈ ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

మొదటిది, అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ జరిగే అదానీ కంపెనీ షేర్లు లేదా బ్లాండ్లను అమ్మడం, రెండోది డెరివేటివ్ సాధనాల ద్వారా ట్రేడింగ్.

ముందుగా షేర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ బాండ్ల ధర గణనీయంగా పడిపోయింది. సాధారణ పెట్టుబడిదారుడికి కూడా వాటిపై 32 శాతం వరకు సంపాదించే మార్గం కనిపిస్తోంది.

అయితే, హిండెన్‌బర్గ్‌కు కేవలం దీనిపై ఆధారపడే లాభం వస్తుందంటే నమ్మడం కష్టం. రెండేళ్ల శ్రమ ఈ మాత్రం లాభం కోసమేనా?

అమెరికాలో అదానీ కంపెనీలకు కొన్ని వందల కోట్ల డాలర్ల షేర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని అప్పుగా తీసుకుని, షార్ట్ సెల్లింగ్ చేసి భారీ లాభాలు సంపాదిస్తారన్న లెక్క చాలా చిన్నదిగా అనిపిస్తోంది.

రెండో మార్గం డెరివేటివ్స్. అంటే ట్రేడింగ్ నేరుగా షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు కాకుండా వేరే అంశాలపై ఆధారపడి జరగడం.

ఉదాహరణకు, సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో భారతదేశంలోని నిఫ్టీకి చెందిన ఒక డెరివేటివ్ నడుస్తుంటుంది. దాని పేరు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ.

ఎస్‌జీఎక్స్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలంటే భారతదేశ స్టాక్ మార్కెట్ చట్టాలు పాటించక్కర్లేదు. అయితే, ఎస్‌జీఎక్స్ నిఫ్టీలో హెచ్చుతగ్గులు భారతదేశంలో నిఫ్టీ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి.

ఇలాంటి డీల్స్ కంపెనీ షేర్ల మీద కూడా జరగవచ్చు. అమెరికాలో కూర్చున్న ఇద్దరు.. భారతదేశంలోని ఒక కంపెనీ షేర్లు పెరుగుతాయా, తగ్గుతాయా అని బెట్టింగ్ కట్టవచ్చు. దానిపై డీల్ కుదుర్చుకోవచ్చు.

 • ‘ఆ ప్లాంట్లకు మా భూములు ఇచ్చి తప్పుచేశాం’ – అదానీ సిమెంట్ ప్లాంట్ల మూతతో రోడ్డున పడ్డ వేలాది జనం
 • ఎన్‌డీటీవీలో ఎంత వాటాను అదానీ సొంతం చేసుకున్నారు.. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇవీ 5 ముఖ్యాంశాలు

హిండెన్‌బర్గ్ ప్రయోజనం పొందుతుందా లేక నష్టపోతుందా?

హిండెన్‌బర్గ్ ఏం ట్రేడింగ్ చేసింది, ఎంత ట్రేడింగ్ చేసిందన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదు. ఆ సంస్థ ఈవివరాలు అందించలేదు.

అమెరికాలోని ఇతర షార్ట్ సెల్లర్లకు కూడా ఇదొక పెద్ద పజిల్‌లా ఉంది.

దీనిపై స్పందించేందుకు హిండెన్‌బర్గ్ నిరాకరించిందని రాయిటర్స్ తెలిపింది. మరోవైపు, అదానీ గ్రూపు గానీ, సెబి గానీ దీనికి జవాబులు చెప్పనేలేదు.

అమెరికా చట్ట ప్రకారం, ముందే షార్ట్ సెల్లింగ్ చేసి, ఆ తరువాత నివేదికను బహిరంగపరచడం, తద్వారా లాభాలు పొందడంపై ఎలాంటి పరిమితులు లేవు.

కానీ, హిండెన్‌బర్గ్ తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసి లాభాలు పొందేందుకు ప్రయత్నించినట్లు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం అది నేరం అవుతుంది.

అయితే, అమెరికాలో కూడా తమపై దావా వేసుకోమని హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపుకు సవాలు విసిరింది.

హిండెన్‌బర్గ్‌కు ఉన్న మరో ముప్పు ఏమిటంటే, ఆ సంస్థ ఇన్‌సైడర్ డీలింగ్ చేసి ఉంటే, ఇబ్బందుల్లో పడుతుంది.

అంటే హిండెన్‌బర్గ్‌కు రహస్య సమాచారమేదో తెలిసి, దాన్ని ఉపయోగించి ట్రేడింగ్ చేసి లాభాలు పొందాలని చూస్తే.. అది నిరూపణ అయితే హిండెన్‌బర్గ్‌కు చిక్కులు తప్పవు.

హిండెన్‌బర్గ్‌కు భవిష్యత్తులో ఏదయితే అది అవుతుంది.

కానీ, ఇప్పుడు అదానీ గ్రూపును చిక్కుల్లోకి నెట్టి హిండెన్‌బర్గ్‌ ఎంత సంపాదించింది, ఎలా సంపాదించింది అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

 • అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్
 • డీజిల్ ఇంజిన్-ను హైడ్రోజన్ ఇంజిన్-గా మార్చే కొత్త టెక్నాలజీ… – BBC News తెలుగు
 • భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- – BBC News తెలుగు
 • ఆంధ్రప్రదేశ్- ఐదు కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణించి బడికి వెళ్తున్న పిల్లలు – BBC News తెలుగు
 • బడ్జెట్ 2023: విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రస్తావన ఏదీ?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *