బీజేపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఓ ఎస్‌యూవీ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడుపుతున్న మోహన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో వాహనాన్ని నియంత్రించలేకపోయినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే హర్తాలు హలప్ప పేరున్న స్టిక్కర్ కారుపై ఉందని పోలీసులు తెలిపారు. అయితే, ఆ కారు ఎమ్మెల్యేది కాదని, ఆయన కూడా ఘటన సమయానికి కారులో లేరని పేర్కొన్నారు.
కాగా, ఈ వాహనం ఎమ్మెల్యే కుమార్తె సుస్మితా హలప్ప మామ, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి రాము సురేశ్‌ది పోలీసులు గుర్తించారు. సురేశ్ వద్ద మోహన్ గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాడని, వాహనం నడిపే సమయంలో మద్యం తాగలేదని వివరించారు. ప్రస్తుతం మెడిసిన్ చదువుతోన్న ఎమ్మెల్యే కుమార్తె సుస్మితా హలప్పా, కిమ్స్‌లో పనిచేస్తోంది. ఆమెను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చేందుకు మోహన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది.
మజీద్ ఖాన్, అయ్యప్ప అనే ఇద్దరు స్కూటర్ రైడర్లపైకి దూసుకెళ్లింది. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రోడ్డుపై పడి ఉన్న రెండు బైక్‌లు.. ఒకదాని పక్కనే మృతదేహం.. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై రక్తం చిమ్మితున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనలో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
Read Latest Crime News And Telugu News