ముఖ్యమంత్రి వస్తారని విశాఖలోని చినముషిడివాడ జంక్షన్ నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లను యంత్రాలతో, కూలీలను పెట్టి మరీ నరికేశారు. శారదా పీఠం రోడ్డుతో పాటు సాగర్ నగర్ బీచ్ రోడ్డులో కూడా చెట్లు నరికేశారు.
కానీ, సీఎం పర్యటన రద్దయింది. దీంతో నరికేసిన చెట్ల స్థానంలో ప్రస్తుతం చిన్న చిన్న మొక్కలను నాటారు. జనవరి 28న శారదా పీఠం వార్షికోత్సవాల కోసం సీఎం వస్తున్నారని సుందరీకరణ, భద్రతా చర్యల్లో భాగంగా చెట్లను తొలగించినట్లు అధికారులు చెప్పారు.
‘చెట్ల స్థానంలో మొక్కలు నాటారు‘
శారదా పీఠం వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారని సీఎంవో నుంచి సమాచారం రాగానే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనవరి 28న సీఎం రాక పేరుతో, అంతకు వారం ముందు నుంచే శారదా పీఠానికి వెళ్లే మార్గంలో అధికారులు, పోలీసులు హడావుడి చేశారు.
ముఖ్యంగా చినముషిడివాడ జంక్షన్ నుంచి శారదా పీఠం దాటిన తర్వాత పార్వతీ నగర్ వరకు ఉన్న ప్రాంతమంతా సుందరీకరణ, భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముందుగా డివైడర్‌పై ఉన్న చెట్లను తొలగించేశారు. పనిలో పనిగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సీఎం పర్యటన రోజు, ముందు రోజు కూడా మూసేయాలని ఆదేశించించారు. జనవరి 27 నాటికి డివైడర్‌పై ఉన్న చెట్లను పూర్తిగా తొలగించి అక్కడ కృతిమ గడ్డిని, చిన్న మొక్కలను నాటారు.
8 ఏళ్ల వయసున్న చెట్లను ఎందుకు తీసేశారో, చిన్న మొక్కలను ఎందుకు తెచ్చిపెట్టారో ఎవరికి అర్థం కాలేదు. ఇంత చేశాక సీఎం పర్యటన రద్దయింది.
సీఎం పర్యటన రద్దవ్వడంతో అధికారులు శారదా పీఠం మార్గంలో చెట్లను తీసేసి, కొత్తగా పెట్టిన మొక్కల సంగతే మర్చిపోయారు. దాంతో వాటికి ఎటువంటి రక్షణ లేక మొక్కలను పందులు తినేయడం ప్రారంభించాయి. ఈ విషయాలపై ఫిర్యాదు అందుకున్న జీవీఎంసీ అధికారులు వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.
- ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి-
- ఆంధ్రప్రదేశ్- ఆ ఊరి పిల్లలు గుర్రాలపై సవారీ చేస్తూ బడికి వెళ్తున్నారు
‘మాకు నీడనిచ్చే చెట్లను తీసేసి, వాలిపోతున్న మొక్కలను నాటారు’
తాము నిత్యం రాకపోకలు సాగించే మార్గంలో ఉన్న చెట్లను ఏ కారణంతో తీసేశారో తెలియడం లేదని స్థానికులు వాపోయారు. సీఎం పర్యటన పేరు చెప్పి చెట్లను తీసేసిన అధికారులు, మళ్లీ చిన్న చిన్న మొక్కలను ఎందుకు వేశారో అర్థం కాలేదని ఆ చెట్లతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు బీబీసీతో పంచుకున్నారు.
“గత ఎనిమిదేళ్లుగా ఆ చెట్లు ఇక్కడే ఉన్నాయి. వాటిని తీసేసి మొక్కలను నాటారు. ఆ మొక్కలను పందులు తింటుంటే ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. కానీ, ఆ మొక్కలు బతకవండి. ఎందుకంటే వాటికి ఎవరూ నీళ్లు పోయడం లేదు. అవి ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. చెట్లను ఎందుకు నరికారో, మళ్లీ చిన్న మొక్కలను ఎందుకు నాటారో అర్థం కావడం లేదు” అని చినముషిడివాడ స్థానికులు బీబీసీతో చెప్పారు.
చెట్లను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నప్పుడు, తొలగించిన చెట్ల స్థానంలో మొక్కలను నాటినప్పుడు రెండు దృశ్యాలను బీబీసీ చిత్రీకరించింది.
కానీ, అలా ఎందుకు చేస్తున్నారనే దానికి సమాధానం చెప్పేవారు లేరు. జీవీఎంసీ నియమించిన కూలీలకు ఈ పని అప్పగించారు తప్ప, అక్కడెవరూ అధికారులు కనిపించలేదు.
“డివైడర్‌పై ఉన్న చెట్ల మధ్యలో మేం కొన్ని పూల మొక్కలు వేశామండి. బాగా పెరిగాయి. అవసరమైనప్పుడు పువ్వులు కోసుకునేవాళ్లం. సీఎం పర్యటన పేరుతో వాటిని కూడా తొలగించారు. చెట్లు, పూల మొక్కలు తీసేసి డివైడర్లపై గడ్డి వేసి, సుందరీకరణ పేరుతో మళ్లీ చిన్న మొక్కలేశారు. ఇంత హడావుడి చేస్తే సీఎం రానేలేదు.” అని చినముషిడివాడలోని దుకాణదారు మరిడిబాబు బీబీసీతో అన్నారు.
చెట్లను తొలగించి, ప్లెక్సీలు పెడుతున్నారు
గతంలో ఏయూలో పీఎం సభ నిర్వహించినప్పుడు, ఇప్పుడు శారదా పీఠం వార్షికోత్సవాలకి సీఎం వస్తారని అనుకున్నప్పుడు, వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు సుందరీకరణ, భద్రతా చర్యలో భాగంగా విశాఖలోని పలు చోట్ల చెట్లను తొలగించారు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలకి రంగులేశారు. ఇలాంటి రంగులేసిన చెట్లు సాగర్ నగర్ బీచ్ రోడ్డులో కనిపిస్తాయి.
వీవీఐపీలు వచ్చినప్పుడు భద్రతా చర్యల పేరుతో పర్యావరణానికి ఎంతో అవసరమైన చెట్లను తొలగిస్తున్న అధికారులే, అదే ప్రాంతాల్లో ప్లెక్సీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్లెక్సీలు పెడుతున్నారు.
చెట్లను తొలగించిన అధికారులు, ప్లెక్సీలకు ఎలా అనుమతిస్తున్నారో తెలియడం లేదు. ప్లెక్సీలు పెట్టిన స్థానిక నాయకులను ప్రశ్నిస్తే… తమ నాయకుడి దృష్టిలో పడేందుకు ప్లెక్సీలు పెట్టడం తప్పనిసరి అంటున్నారు.
శారదా పీఠంకు వెళ్లే దారిలో కూడా జగన్ ఫోటోతో పాటు స్థానిక నేతల ఫోటోలున్న ప్లెక్సీలు రోడ్డుకు ఇరువైపులా కనిపించాయి. శారదా పీఠం వార్షికోత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఆ ప్లెక్సీలు ఇంకా అక్కడే ఉన్నాయి.
- వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన మంగళగిరి క్రికెట్ స్టేడియం నేటికీ ఎందుకు పూర్తి కాలేదు-
- బడ్జెట్ 2023- విశాఖ ప్రత్యేక జోన్ ప్రస్తావన ఏదీ-
‘విశాఖలో పర్యావరణానికి ముప్పు’
విశాఖలో చెట్లను తొలగించడం పీఎం, సీఎం పర్యటనల సందర్భంగా ఇది రెండోసారి. మరో వైపు చాలా కాలంగా రుషికొండను తొలిచేస్తున్నారంటూ వివాదం నడుస్తోంది.
రుషికొండపై ఉన్న పచ్చదనాన్ని తొలగిస్తూ కాటేజీల నిర్మాణం అంటున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం నేరుగా స్పందించడం లేదు.
కోర్టులు, గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కూడా రుషికొండపై తవ్వకాలు విషయంలో కేసులు నడుస్తున్నాయి. ఒక వైపు కొండలు, మరో వైపు చెట్లు తొలచివేస్తూ విశాఖలో పర్యావరణానికి ముప్పుని తీసుకొస్తున్నారంటూ పర్యావరణవేత్తలు అంటున్నారు.
“విశాఖలో ఎక్కడ చూసినా కొండలు, పచ్చదనంతో ఉంటుంది. కానీ ప్రస్తుతం విశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొండలను తొలిచి వేస్తున్నారు. వీఐపీల పర్యటనల పేరుతో చెట్లను నరికేస్తున్నారు. చెట్లు పెరగడానికి సంవత్సరాలు పడితే, క్షణాల్లో వాటిని తొలగించేస్తున్నారు. మన జీవనానికి అవసరమైన చెట్లు, పర్యావరణం పట్ల ఇలాంటి నష్టదాయకమైన చర్యలకు పాల్పడితే మనకేమీ భవిష్యత్తు ఉంటుంది?” అని పర్యావరణ వేత్త జయశ్రీ హట్టంగడి ప్రశ్నించారు.
‘స్థానిక నాయకుల అత్యుత్సాహం’
సీఎం, మంత్రులు ఏదైనా ప్రాంతానికి పర్యటనకు వస్తే ఆ ఏరియాలోని స్థానిక నాయకులు ఆయా వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో స్వాగతం పలుకుతూ దారి పొడవునా ప్లెక్సీలు పెడుతుంటారు.
ఈ మధ్యకాలంలో తక్కువ ధరలకే ప్లెక్సీలు అందుబాటులో ఉండటంతో ఏ చిన్న నాయకుడికైనా భారీ సైజులో ప్లెక్సీలు పెడుతున్నారు. ఆ ప్లెక్సీలపై తమ బొమ్మలను ముద్రించుకుని ఒక రకమైన బల ప్రదర్శన చేస్తున్నారు.
నిజానికి ఏ వీఐపీ తమ ఫోటోలను ముద్రించి భారీగా ప్లెక్సీలు పెట్టాలని అడగరని ఏయూ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ రమణమూర్తి చెప్పారు.
”ఇదంతా స్థానిక నాయకులు భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద స్టేజీలు, బ్యానర్లతో తమ బలాన్ని ప్రదర్శించి, నాయకుడి వద్ద మంచి మార్కులు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి బల ప్రదర్శనలో భాగంగానే చెట్లను నరకడం వంటివి చేస్తుంటారు. తాము పర్యావరణానికి చేస్తున్న హాని కంటే తమకెంత లాభమనేది చూసుకుంటారు. ఇది ఎక్కడైనా కనిపించే ట్రెండే. దీనిని నియంత్రించాలంటే ఆయా నాయకులే ఇటువంటి పనులు చేయొద్దని పార్టీకి, క్యాడర్‌కు పిలుపునివ్వాలి” అని రమణమూర్తి అన్నారు.
- ఆంధ్రప్రదేశ్- శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు గుజరాత్-కు ఎందుకు వలస పోతున్నారు-
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి… నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
అధికారులు ఏమంటున్నారంటే…
సీఎం పర్యటన కోసం విశాఖలో చెట్లను తొలగించడం విమర్శలకు దారి తీసింది. దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించారు. సీఎం పర్యటన కోసం చెట్లను నరికేశామనేది వాస్తవం కాదని, తమకు వచ్చిన ఫిర్యాదులు, నగర పరిశుభ్రత, రోజూ వారి విధుల్లో భాగంగానే కొన్ని చోట్ల చెట్లను, మొక్కలను తొలగించామని చెప్పారు.
“హానికరమైన చెట్లుగా భావిస్తున్న కోనోకార్పస్ మొక్కలనూ, కొన్ని చోట్ల రహదారులకు ఇరువైపులా ఎదిగిన చెట్ల కొమ్మలు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని తొలగిస్తాం. అలాగే మరి కొన్ని చెట్లు ఎండిపోయినవి, ఎదగని మొక్కలు ఉంటాయి. ఇటువంటి వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు వేస్తుంటాం. సీఎం పర్యటన సందర్భంగా జీవీఎంసీ కొన్ని సుందరీకరణ పనులు చేపట్టింది. అంతేకానీ, సీఎం పర్యటన కోసం చెట్లను తొలగించడమనేది అవాస్తవం.” అని జీవీఎంసీ కమిషనర్ పి. రాజాబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు… లాభాలు ఎలా వస్తాయ్
- అమెరికా- చైనా ‘స్పై బెలూన్-’ను మిసైల్ ప్రయోగించి అట్లాంటిక్ సముద్రంలో కూల్చేసిన యూఎస్
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)