భారత్‌తో తొలి టెస్టు ముంగిట ఆస్ట్రేలియా (Australia)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నాగ్‌పూర్ వేదికగా గురువారం ఉదయం 9:30 గంటలకి ఫస్ట్ టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆస్ట్రేలియా టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith).. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) కూడా గాయంతో తొలి టెస్టుకి దూరంగా ఉండబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా టీమ్ ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ గాయపడి తొలి టెస్టుకి దూరమైన విషయం తెలిసిందే.
కామెరూన్ గ్రీన్ ఈ భారత్ పర్యటనలో కీలకం అవుతాడని ఆస్ట్రేలియా ఆశించింది. టెస్టుల్లో కేవలం బ్యాటర్‌గానే ఆస్ట్రేలియా ఈ 23 ఏళ్ల ఆల్‌రౌండర్‌ని వినియోగించుకుంటోంది. సాధారణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే కామెరూన్ గ్రీన్.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనా క్రీజులోకి వెళ్లగలడు. అయితే.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కామెరూన్ గ్రీన్ చేతి వేలికి గాయమైంది. అయినప్పటికీ భారత్‌తో సిరీస్ కోసం అతడ్ని ఎంపిక చేశారు.
తొలి టెస్టు టైమ్‌కి కామెరూన్ గ్రీన్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆస్ట్రేలియా టీమ్ ఆశించింది. కానీ.. అతను ఇంకా పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోలేదని ఈ రోజు స్టీవ్‌స్మిత్ తేల్చి చెప్పేశాడు. ‘‘కామెరూన్ గ్రీన్ గాయం తర్వాత ఇప్పటి వరకూ ఫాస్ట్ బౌలింగ్‌ని ఎదుర్కోలేదు. కాబట్టి.. నేను ధైర్యంగా అతను తొలి టెస్టులో ఆడే అవకాశం లేదని చెప్తున్నా. అతను ట్రైనింగ్ సెషన్‌లోనూ ప్రాక్టీస్ చేస్తుండగా నేను చూడలేదు’’ అని స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు.
హేజిల్‌వుడ్ గాయపడటంపై స్టీవ్‌స్మిత్ మాట్లాడుతూ.. ‘‘హేజిల్‌వుడ్ గాయపడి తొలి టెస్టుకి దూరమవడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. కానీ.. లాన్స్ మోరీస్, స్కాట్ బొలాండ్ నాణ్యమైన బౌలర్లు. బొలాండ్ న్యాచురల్ లెంగ్త్ భారత్ పిచ్‌లకి బాగా నప్పుతుంది’’ అని స్పష్టం చేశాడు. 2004 నుంచి భారత్ గడ్డపై ఆస్ట్రేలియా టీమ్ టెస్టు సిరీస్‌ని గెలవలేకపోతోంది. అలానే 2008 తర్వాత తొలిసారి నాగ్‌పూర్ మళ్లీ టెస్టు మ్యాచ్‌ని కంగారూలు ఆడబోతున్నారు.
Read Latest
Sports News
,
Cricket News
,