ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. గత చంద్రబాబు హయాంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేశామన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి పార్లమెంట్ సాక్షిగా రూ. 15 వేల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు.
ఇక, రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష తెలుగు దేశం పార్టీలపై సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవి రెండూ కుటుంబ, దోపిడీ పార్టీలని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసి లక్ష సమస్యలు సేకరించి జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. కర్ణాటకలో తుంగభద్రపై నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల రాయలసీమకు దక్కాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా చూస్తామని ప్రకటించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతున్న పొత్తుల వ్యవహారంపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.