హాట్ కామెంట్స్‌తో హీట్ పుట్టించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై పోటీ దిగబోతున్నట్లు రేణుకా చౌదరి ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రమే కదా, ఏపీలో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని, అందుకే గుడివాడలో పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానన్న రేణుకాచౌదరి.. తన మనసులో గుడివాడ కూడా ఉందన్నారు. రెండు చోట్లా పోటీ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ఖమ్మం ఎంపీగా పోటీ చేసే విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానన్నారు.