గుండెల్ని పిండేసే ఘటన.. అంత్యక్రియలకు డబ్బుల్లేక కుమార్తె మృతదేహంతో ఇంటింటికీ తిరిగిన తల్లి

చనిపోయిన తన కుమార్తె మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని.. అంత్యక్రియలకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ ఓ అభాగ్యురాలు రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగింది. గుండెల్ని పిండేసే అత్యంత అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాంకేర్ జిల్లా మలంజికుండమ్‌కి చెందిన మన్సు గవాడే (22) అనే మహిళకు లక్ష్మణ్ గవాడేతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండేళ్ల కిందట వీరి ఆడపిల్ల పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో చికిత్స చేయించడానికి భర్త నిరాకరించాడు. భర్త పట్టించుకోకపోవడంతో తల్లీ కుమార్తెలు ఒంటరయ్యారు. పౌష్టికాహారం లేక కుమార్తె ఆరోగ్యమూ క్షీణించింది. ఇదే సమయంలో పుట్టింటి వాళ్లు కూడా ఆదరించలేదు.

ఆమె చర్చికి వెళ్లడంపై అభ్యంతరం తెలిపిన కన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. పౌష్టికాహార లోపంతో పాప ఆరోగ్యం క్షీణించింది. చికిత్స అందక ఆ చిన్నారి ఫిబ్రవరి 4న కన్నుమూసింది. ఆ పాప అంత్యక్రియలకు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో కుమార్తె మృతదేహాన్ని భుజాలుపై వేసుకుని శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు సాయం కోసం ఇంటింటికీ తిరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంకేర్‌ జిల్లా అధికారులు అంత్యక్రియలు జరిపించారు.

ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించి.. వైద్య చికిత్స అందజేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్యం క్షీణించినా భర్త కనీసం పట్టించుకోలేదని ఆమె వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *