టర్కీ భూకంపాన్ని పక్షులు ముందుగానే గుర్తించాయా? వైరల్‌ వీడియోలో ఏముంది?

సోమవారం టర్కీ (Turkey), సిరియా (Syria)లో సంభవించిన భూకంపాల(Earthquake)లో సుమారు 4000 మందికి పైగా మరణించారు. వేల మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన ప్రాంతాల నుంచి అనేక హృదయ విదారక వీడియోలు వెలువడ్డాయి. అయితే పక్షులు అస్తవ్యస్తంగా ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో టర్కీకి చెందిందని, ఆ ప్రాంతంలో భూకంపం రావడానికి ముందే పక్షులు ఈ రీతిలో స్పందించాయని, ప్రమాదాన్ని ముందే అంచనా వేశాయని ఆ పోస్ట్‌ పేర్కొంటోంది.

* నెటిజన్ల భిన్న వాదనలు

పక్షులకు సంబంధించిన వీడియోపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని జంతువులు, పక్షులు , సముద్ర జీవులు ప్రతి ప్రకృతి విపత్తును ముందుగానే గ్రహించగలవని, మానవులు ఆ భావాన్ని కోల్పోయారని ఓ నెటిజన్‌ స్పందించారు. మరి కొందరు.. వీడియో పక్షులన్నీ ఓ చెట్టుపై వాలుతున్నాయి.. మా పరిసరాల్లో కాకులు రోజూ ఇలానే చేస్తుంటాయని కామెంట్‌ చేశారు.

* జంతువులు, పక్షులు భూకంపాన్ని అంచనా వేయగలవా?

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. పెద్ద భూకంపానికి ముందు జంతువులు వింతగా ప్రవర్తించడం అనేది పురాతన గ్రీస్‌లో 373 BC సమయంలోనే గుర్తించినట్లు సమాచారం. వినాశకరమైన భూకంపం సంభవించడానికి చాలా రోజుల ముందు ఎలుకలు, వీసెల్స్, పాములు వంటివి ఉన్న చోటును విడిచి పెట్టి వెళ్లాయని నివేదిక పేర్కొంది. జంతువులు, పక్షులు వివిధ మార్గాల్లో భూకంపాన్ని గ్రహించవచ్చు. కొన్ని జంతువులు భూకంపానికి ముందు సంభవించే విద్యుదయస్కాంత క్షేత్రంలో మార్పులను తెలుసుకోవచ్చు. మరికొన్ని భూకంపం సంభవించే ముందు బారోమెట్రిక్ పీడనంలో మార్పులను గుర్తించవచ్చు.

భూమికి లోపల బొరియలు, గూళ్లలో ఉండే జంతువుల, భూకంపానికి ముందు సంభవించే భూమి కదలికలను గమనించగలవు. భూకంపాలు తక్కువ-పౌనఃపున్య ప్రకంపనలను సృష్టిస్తాయి, వాటిని మానవులు గ్రహించలేకపోవచ్చు. కానీ కుక్కల వంటి కొన్ని జంతువులు ఆ ప్రకంపనలను పసిగట్టగలవు.అయితే జంతువులు, పక్షులు భూకంపాలను పసిగట్టగలవా? వాటికి ఉన్న ప్రత్యేక సామర్థ్యాలు ఏంటనే అంశంపై కచ్చితమైన ఆధారాలు లేవు.

ఇది కూడా చదవండి :  ఆ దేశాల్లో రోజూ భూకంపాలు .. అక్కడే ఎందుకీ పరిస్థితి?

* అండగా ఉంటామన్న మోదీ

ప్రస్తుత భూకంపాన్ని కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొంటున్నారు. టర్కీ నగరమైన గాజియాంటెప్ సమీపంలో 7.7 తీవ్రతతో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కొన్ని గంటల తర్వాత రెండో సారి 7.5 తీవ్రతతో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీ రాజధాని అంకారాలో సంభవించింది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం నుంచి కోలుకునేందుకు బాధిత ప్రాంతాలకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. భారతదేశం సహా ప్రపంచంలోని ఇతర దేశాలు టర్కీకి సంఘీభావం తెలిపాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాణనష్టాన్ని ఎదుర్కోవడానికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *