టర్కీ మిత్రదేశమైనా సరే.. వంకర బుద్ధి బయటపెట్టుకున్న పాకిస్థాన్.. ప్రాణాల కంటే పంతానికే ప్రాధాన్యం!

రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కుప్పను తలపిస్తోన్న టర్కీ, సిరియాలను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో ముందుకొస్తున్నాయి. భారత్ సైతం రెండు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బలగాలు టర్కీ త్వరగా చేరుకోవడానికి వీలుగా మీ గగనతలం మీదుగా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్‌ను భారత్ కోరగా.. దాయాది అందుకు నిరాకరించింది. భారత్ మానవతా సాయాన్ని తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్ నిరాకరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్థాన్ ఒప్పుకుంటే.. ఘజియాబాద్ నుంచి పాక్, అప్ఘాన్, ఇరాన్ మీదుగా విమానం వెళ్లేది కానీ పొరుగు దేశం ఒప్పుకోకపోవడంతో.. పాక్ చుట్టూ తిరుగుతూ.. రెస్క్యూ బలగాలను టర్కీకి తరలించాల్సి వచ్చింది. డ్రిల్లింగ్ పరికరాలు, ఔషదాలు, రెస్క్యూ డాగ్స్‌తో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దక్షిణ టర్కీలోని అడానా ఎయిర్‌పోర్ట్‌లో దిగాయి. భూకంపం వల్ల భవనాలు కూలగా.. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడటంతోపాటు.. వారికి తక్షణమే చికిత్స అందించడం కోసం ఓ ఫీల్డ్ హాస్పిటల్‌ను సైతం భారత సైన్యం ఏర్పాటు చేస్తోంది. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని సైతం టర్కీ పంపించడానికి ఇండియా సిద్ధంగా ఉంచింది.

2021 చివర్లో తాలిబన్లు అప్ఘానిస్థాన్‌ను ఆక్రమించినప్పుడు.. నలిగిపోతున్న అప్ఘాన్ ప్రజలకు సాయంగా 50 వేల టన్నుల గోధుమలను భారత్ పంపించాలని నిర్ణయించింది. కానీ ఆ సాయాన్ని తమ దేశం మీదుగా పంపించడానికి పాక్ నిరాకరించింది. వాఘా బోర్డర్ ద్వారా పాకిస్థానీ ట్రక్కుల్లో గోధుమలను పంపించాలని.. వాటిని తమ దేశం మీదుగా పంపిస్తామని పాక్ ప్రతిపాదించింది.

వాస్తవానికి పాకిస్థాన్‌కు టర్కీ మిత్ర దేశం. కశ్మీర్ విషయంలో టర్కీ ఎప్పటికప్పుడు భారత్‌ను ఇబ్బంది పడుతూనే ఉంది. కానీ అదే టర్కీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భారత్ సాయం చేసేందుకు ముందుకు రాగా… పాక్ మాత్రం భారత బృందాలను తమ దేశం మీదుగా వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా మన దేశం పట్ల ఉన్న అక్కసును మరోసారి బయటపెట్టుకుంది.

కష్ట సమయంలో తమ దేశానికి ఆపన్న హస్తాన్ని అందించిన భారత్‌కు మన దేశంలోని టర్కీ ఎంబసీ ధన్యవాదాలు తెలిపింది. ‘ఫస్ట్ బ్యాచ్ రిలీఫ్ మెటీరియల్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, శిక్షణ పొందిన శునకాలు ఇప్పుడే టర్కీ చేరుకున్నాయి. మీ మద్దతు, సంఘీభావానికి ధన్యవాదాలు’ అని టర్కీ ఎంబసీ ట్వీట్ చేసింది. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడంటూ.. టర్కీ అంబాసిడర్ భారత్‌ను స్నేహితుడి (దోస్త్)గా అభివర్ణించడం గమనార్హం.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *