తుర్కియే-సిరియా: భూకంపానికి కారణం ఏంటి… ఇంత విలయాన్ని ఎందుకు సృష్టించింది?

సిరియా సరిహద్దు సమీపంలోని ఆగ్నేయ తుర్కియేలో సోమవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం కారణంగా 4,300 మందికి పైగా మరణించారు.

గాజియాంటెప్ నగర సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత చాలా శక్తిమంతమైన ప్రకంపనలు తుర్కియేని వణికించాయి. ఈ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత తొలుత సంభవించిన భూకంపం తీవ్రతకు దాదాపు సమానంగా ఉంది.

  • తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య… కొనసాగుతున్న సహాయక చర్యలు
  • తుర్కియే-సిరియా- ‘గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం’ – అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి

ఎందుకు ఇంత తీవ్ర

సోమవారం ఉదయం చాలా శక్తిమంతమైన భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దాని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భూకంపాన్ని తీవ్రమైనదిగా వర్గీకరించారు. ఫాల్ట్‌లైన్ వెంట 100 కి.మీ మేర ఇది ప్రభావం చూపింది. భూకంప తీవ్రతకు ఈ పరిధిలోని భవనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.

లండన్ యూనివర్సిటీకి చెందిన రిస్క్ అండ్ డిజాస్టర్ రిడక్షన్ ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి, ప్రొఫెసర్ జొయానా ఫార్ వాకర్ ఈ ప్రకృతి విపత్తు గురించి బీబీసీతో మాట్లాడారు.

”ఒక సంవత్సరంలో సంభవించిన తీవ్రమైన భూకంపాలను చూస్తే, గత పదేళ్లలో రెండు మాత్రమే సమాన తీవ్రతతో ఏర్పడ్డాయి. అంతకుముందు పదేళ్లలో ఇలా సమాన తీవ్రతతో సంభవించిన భూకంపాలు నాలుగు ఉన్నాయి” అని జొయానా చెప్పారు.

ఇంత వినాశనానికి భూకంప తీవ్రత ఒక్కటే కారణం కాదు.

సోమవారం ఉదయం వేళలో ప్రజలు ఇళ్లలో నిద్రిస్తోన్న సమయంలో ఈ విపత్తు సంభవించింది.

భవనాల పటిష్టత కూడా ఈ భారీ ప్రాణనష్టానికి ఒక కారణం.

పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలో రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ వోల్కనాలజీపై అధ్యయనం చేసే డాక్టర్ కార్మన్ సోలానా కూడా ఈ విపత్తు గురించి మాట్లాడారు.

”దురదృష్టవశాత్తు తుర్కియేలో ముఖ్యంగా సిరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. కాబట్టి ప్రాణాలను కాపాడటం అనేది కష్టం అవుతుంది. బాధితులను గుర్తించడానికి విపత్తు జరిగిన తర్వాతి 24 గంటలు చాలా కీలకం. 48 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది” అని కార్మన్ చెప్పారు.

ఈ రీజియన్‌లో 200 ఏళ్లకు పైగా ఎలాంటి పెద్ద భూకంపాలు గానీ, వాటికి సంబంధించిన హెచ్చరికల సంకేతాలు గానీ రాలేదు. కాబట్టి తరచుగా విపత్తులను ఎదుర్కొనే వారితో పోల్చితే ఈ రీజియన్‌లో ఈ విపత్తును ఎదుర్కొనే సంసిద్ధత స్థాయి తక్కువగానే ఉంటుంది.

  • జోషీమఠ్- భూమి కుంగిపోతూ, ఇళ్ళు బీటలు వారుతున్న చోట ప్రజలు ఎలా జీవిస్తున్నారు- – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
  • జోషీమఠ్– 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల.. ఇస్రో శాటిలైట్ సమాచారం వెల్లడి

భూకంపానికి కారణం ఏంటి?

భూమి ఉపరితలం వేర్వేరు పలకలు ఉంటాయి. ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి.

ఇవి తరచుగా కదలుతుంటాయి. కానీ కొన్నిసార్లు పక్క పక్కనే ఉండే పలకల అంచులు ఒకదానితో మరొకటి తగిలి ఆగిపోతుంటాయి. మరొకవైపు పలకలు కదలడానికి ప్రయత్నిస్తుంటాయి. అందువల్ల అంచుల వల్ల ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.

అలా ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినప్పుడు ఒక పలక మీదకు మరొక పలక చేరడం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలో భూమి పొరలు కదులుతాయి. అలా ఆకస్మిక కదలికల కారణంగా పుట్టే తరంగాలతో భూమి కంపిస్తుంది.

తుర్కియేలో సంభవించిన భూకంపంలో అరేబియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్‌పైకి చేరింది.

గతంలో సంభవించిన చాలా తీవ్రమైన భూకంపాలకు భూ ఉపరితంలోని పలకల మధ్య రాపిడి కారణమైంది.

1822 ఆగస్టు 13న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం నమోదైన భూకంప తీవ్రత దీని కంటే ఎక్కువ. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 7.8గా గుర్తించారు.

1822 నాటి భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తు కారణంగా అలెప్పొ నగరంలోనే 7,000 మరణాలు నమోదయ్యాయి.

దీని తాలూకూ ప్రకంపనలు దాదాపు సంవత్సరం పాటు కొనసాగాయి.

తుర్కియేలో తాజా భూకంపం తర్వాత కూడా అనేక ప్రకంపనలు వచ్చాయి. గతంలో ఈ రీజియన్‌లో సంభవించిన తీవ్రమైన భూకంపం తర్వాత పరిస్థితులే ఇప్పుడు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

  • అఫ్గానిస్తాన్‌: వందల కొద్దీ భూకంపాలు, గత పదేళ్లలో 7 వేల మరణాలు… ఈ ప్రాంతంలోనే ఎందుకిలా?
  • సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలుడును శాటిలైట్లు ఎలా గుర్తించగలిగాయి?

భూకంపాలను ఎలా కొలుస్తారు?

మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ (ఎండబ్ల్యూ)తో భూకంపాలను కొలుస్తారు.

రిక్టర్‌ స్కేలు స్థానంలో దీన్ని వాడుతున్నారు. రిక్టర్ స్కేలు కంటే కచ్చితత్వంతో ఇది భూకంప తీవ్రతను కొలుస్తుంది.

ఈ స్కేలుపై గుర్తించిన సంఖ్య… పాల్ట్ లైన్‌ కదిలిన దూరం, దాన్ని కదిలించిన శక్తి కలయికను సూచిస్తుంది.

2.5 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు సాధారణంగా మనకు ఎలాంటి హాని చేయవు. కానీ, వాటిని స్కేలుపై గుర్తించవచ్చు.

5 తీవ్రతతో వచ్చే భూకంపాలు స్వల్ప స్థాయిలో నష్టాలను కలిగిస్తాయి. తుర్కియేలో 7.8 తీవ్రతతో నమోదైన భూకంపాన్ని తీవ్రమైనదిగా వర్గీకరించారు. ఇది తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. తుర్కియేలో ఇదే జరిగింది.

ఇక 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వాటిల్లితే కోలుకోలేని విధంగా నష్టం కలుగుతుంది. ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంసం అవుతుంది.

  • పాకిస్తాన్‌లో భూకంపం – 20 మంది మృతి
  • హైతీ: కరిబియన్ దీవిలో తీవ్ర భూకంపం.. 1297 మంది మృతి

అతి తీవ్రమైన భూకంపాలు సంభవించాయా?

2011 జపాన్ తీరంలో 9 తీవ్రతతో నమోదైన భూకంపం కారణంగా చాలా తీవ్రమైన నష్టం కలిగింది. సునామీకి దారితీసింది.

అతిపెద్ద భూకంపం 1960లో చిలీలో నమోదైంది. దాని తీవ్రతను 9.5గా గుర్తించారు

ఇవి కూడా చదవండి:

  • తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య… కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ద‌ళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 ల‌క్ష‌ల స్కాల‌ర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
  • తుర్కియే-సిరియా- ‘గత 84 ఏళ్ళల్లో ఇదే అతి పెద్ద భూకంపం’ – అధ్యక్షుడు ఎర్దొవాన్, దాదాపు 2,000 మంది మృతి
  • బంగ్లాదేశ్: ఒకే రాత్రి 12 హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు
  • నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం… ఏమిటీ కథ?

(బీబీసీ తెలుగును , , లో ఫాలో అవ్వండి. లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *