పల్నాడు: పెట్రోల్‌ లేకుండా నడిచే బైక్ కనిపెట్టిన మెకానిక్.. అద్భుతమంటున్న జనాలు

ఆయనేమో ఓ సాదాసీదా మెకానిక్. ఊర్లళ్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కానీ అవసరం ఆయనతో ఓ కొత్త ఆవిష్కరణ చేయించింది. అందుకే అంటారు అవసరం ఏదైనా నేర్పిస్తుందని. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో మండిపోయిన ఈ షేక్ చిన్నమస్తాన్ వలి అనే మెకానిక్.. పెట్రోల్ అవసరమే రాని ఓ బైక్ తయారు చేశాడు. పగలు సౌరశక్తితో, రాత్రిపూట బ్యాటరీతో నడిచే బైక్ రూపొందించాడు షేక్ చిన్నమస్తాన్ వలి.

షేక్ చిన్నమస్తాన్ వలి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ మోటార్ మెకానిక్. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలను భరించలేకపోయాడు ఆయన. సంపాదనలో ఎక్కువ భాగం పెట్రోల్‌ కొనడానికే సరిపోతుండటంతో తన బుర్రకు పదునుపెట్టాడు. చివరకు పెట్రోల్ అవసరమే లేని బైక్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు షేక్ చిన్న మస్తాన్ వలి. అలా రూపొందిందే ఈ సోలార్ బైక్. సుమారు లక్షా 30 వేలు ఖర్చుపెట్టి ఈ భైక్ రూపొందించాడు ఆయన. అది కూడా ఐదురోజ్లులోనే పూర్తిచేయడం విశేషం.

బైక్ మీద అమర్చిన సోలార్ ప్యానెల్ సహాయంతో ఈ సోలార్ బైక్ పగలంతా నడుస్తుంది. ఇక రాత్రిపూట ఎలా అనే ఆలోచన మెదిలింది చిన్నమస్తాన్ వలికి. దీంతో బైక్‌లో ఓ బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ఈ బ్యాటరీ సాయంతో రాత్రిపూట బైక్ ముందుకు వెళ్తుంది. రెండు గంటలు ఛార్జిచేస్తే సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చట.

ఈ సోలార్ బైక్ మీద నలుగురు కూర్చుని ప్రయాణించవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటిదే ఓ ఆటో తయారు చేస్తానంటున్నాడు షేక్ చిన్నమస్తాన్ వలి. మస్తాన్ వలి రూపొందించిన ఈ సోలార్ బైక్‌ను స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన టాలెంట్‌ను అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *