బంగ్లాదేశ్ ఠాకుర్‌గావ్ జిల్లాలోని బలియదాంగి ప్రాంతంలో రోడ్డు పక్కనున్న 12 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.
రాత్రికి రాత్రే ఆలయాల్లోని 14 విగ్రహాలను పగలగొట్టారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
”ఫిబ్రవరి 4 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు” అని బలియదాంగి పోలీసు స్టేషన్ అధికారి ఖైరుల్ అనమ్ చెప్పారు.
అసలేం జరిగింది?
ఆరేడు కిలోమీటర్ల మార్గంలో ఉన్న ఆలయాలను, వాటిలో ఉన్న విగ్రహాలను వీరు ధ్వంసం చేశారని బలియదాంగి ప్రాంతానికి చెందిన కార్యనిర్వహణ అధికారి విపుల్ కుమార్ తెలిపారు.
ఈ ఆలయాల్లో ఎలాంటి పర్యవేక్షణ లేదని, ఇవి చాలా చిన్నవని చెప్పారు.
”ఇవి అంత పెద్ద, ప్రముఖ ఆలయాలు కావు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, వెదురు బొంగుల చెట్ల దగ్గర వీటిని ఏర్పాటు చేశారు” అని పోలీసు అధికారి ఖైరుల్ అనమ్ చెప్పారు. ఈ ఆలయాల్లో ఎలాంటి ప్రార్థనలు జరగడం లేదని కూడా అన్నారు.
రాత్రి పూట ఎవరు ఈ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశారో తెలియదన్నారు.
కొన్ని విగ్రహాలకు చేతులు, కొన్ని విగ్రహాలకు తలలు విరిగిపోయాయని చెప్పారు.
దంతాలా ప్రాంతంలో గరిష్టంగా 8 ఆలయాలను, వాటిల్లో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు.
రాత్రి పూట మోటార్ సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు ఇలా చేసుంటారని విపుల్ కుమార్ అనుమానిస్తున్నారు.
” మోటార్ సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు ఐరన్ రాడ్‌తో ఈ విగ్రహాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లుంటారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ పని చేసినట్టు నేననుకోవడం లేదు” అని అన్నారు.
- వికారాబాద్‌లో జరిగింది మత ఘర్షణేనా? బీబీసీ కవరేజీలో బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాలివే…
- ఆస్ట్రేలియా- పదిహేను రోజుల్లో మూడోసారి హిందూ దేవాలయాలపై దాడి.. ఏం జరుగుతోంది-
గత వందేళ్లలో తొలిసారి ఇలాంటి సంఘటన
గత వందేళ్లలో తొలిసారి ఇలాంటి సంఘటన జరిగిందని విపుల్ కుమార్ చెప్పారు. ఈ సంఘటనలో బయట వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
ఈ ఆలయాలకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు తమ పాలకమండలి సిద్ధమవుతోందని చెప్పారు. ఈ సదుపాయాల కల్పన ద్వారా ఇక నుంచి ఇలాంటి సంఘటనలకు తావుండదని భావిస్తున్నారు.
విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనపై తమ ప్రాంతంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తలేదని దంతాలా యూనియన్ ఛైర్మన్ సమర్ కుమార్ ఛటోపాధ్యాయ్ తెలిపారు.
తమ ప్రాంతంలో చాలా మంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని, సోమవారం ఈ ఏరియాలో పోలీసులు పెట్రోలింగ్ చేశారని చెప్పారు.
ఆలయాలను ఎవరు ధ్వంసం చేసుంటారనే ప్రశ్నకు మాత్రం ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు.
ఈ ప్రాంతంలో విగ్రహాలను ధ్వంసం చేశారు, కానీ రాత్రి పూట ఈ సంఘటన జరగడం వల్ల ఎవరు ఈ పని చేసుంటారని గుర్తించడం కష్టతరమవుతుందని చారోల్ ప్రాంతానికి చెందిన ఛైర్మన్ దిలీప్ కుమార్ ఛటర్జీ అన్నారు.
ఈ సంఘటనపై ప్రజలు ఆందోళన చెందడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి:
- క్రైస్తవ మిషనరీలు మత మార్పిడుల కోసం బుద్ధుడి జన్మస్థలాన్ని టార్గెట్ చేశాయా-
- తెలంగాణ- గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్-ను వివాదంలోకి లాగారా… బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- సమ్మెద్ శిఖర్- జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం… ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా
- జెరూసలేం- అల్-అక్సా… మందిరం ఒక్కటే… ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది
- గుజరాత్- శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు..-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)