భూకంపం మీద భూకంపం.. మృతుల దిబ్బగా టర్కీ, భవనాలు కూలుతున్న వీడియోలు

ఈ శిథిలాల కింద నా కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు సార్.. కుప్పకూలిన భారీ భవనం వద్ద రోదిస్తూ, చేతులతో వ్యర్థాలను తొలగిస్తూ ఓ బాధితుడు చెప్పిన మాటలివి. టర్కీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో భారీ భవనాలన్నీ కుప్పకూలి నేలమట్టం అయ్యాయి. గడిచిన వందేళ్లలోనే అత్యంత తీవ్రమైన భూకంపం టర్కీ, సిరియాను కుదిపేసింది. భూకంపం మీద భూకంపం మరింత విషాదం నింపింది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం 4.17 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈసారి 7.8 తీవ్రతతో భూమి కంపించింది.

వరుస భూకంపాల అనంతరం టర్కీ మృతుల దిబ్బగా మారింది. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం.. టర్కీలో 912 మంది, సిరియాలో 326 మంది మృతి చెందారు. వేలాది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో, ప్రత్యేక శిబిరాల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. అనధికారికంగా మృతుల సంఖ్య 3 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

శిథిలాల కింద తమవారు బతికున్నారో, లేదో తెలియక బాధితులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. భూకంపానికి సంబంధించిన విషాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టర్కీలోని ప్రధాన పట్టణాల్లో సుమారు 2400 భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. నష్టం పెద్ద ఎత్తున ఉండటంతో సహాయక కార్యక్రమాలు అందరికీ అందడం లేదు. కూలిన భవనాల వద్ద శిథిలాలను చేతులతో పక్కకు తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

చంటిబిడ్డలను ఎత్తుకొని ప్రాణ భయంతో వీధుల వెంట పరుగుతుండగా.. పక్కనే ఉన్న భవనాలు కుప్పకూలుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నిద్రలోనే చాలా మంది మృతి చెందారు. మెలకువ వచ్చిన వారు, ఆరుబయట ఉన్న మరి కొంత మంది.. ప్రాణ భయంతో వీధుల్లో పరులు తీశారు.

సిరియాలో అంతర్యుద్ధం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్లుగా టర్కీలోని వివిధ పట్టణాలకు వచ్చి నివాసం ఉంటున్న వందలాది మంది ఈ భూకంపంలో మృత్యువాతపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న టర్కీ.. ప్రపంచ దేశాల సాయం కోసం అర్థిస్తోంది. భారత్.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, ఔషధాలను, వైద్య సిబ్బందిని పంపిస్తోంది. ఉక్రెయిన్ సహా పలు దేశాలు టర్కీకి సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించాయి.

Photos:

ఎటు చూసినా విషాదమే.. టర్కీ భూకంపం దృశ్యాలు

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *