యాంకర్ పిలుపు నచ్చలేదన్న విజయ్ సేతుపతి.. ఇన్ని సినిమాలు చేస్తూ వద్దంటే ఎలా?

సౌత్‌ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న మెజారిటీ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కనిపిస్తున్నాడు. టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో గుర్తింపు పొందినప్పటికీ.. అంతకు మునుపు చాలా ఏళ్ల కిందటే ‘పిజ్జా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. అయితే ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ వంటి సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా పిలవబడుతున్నారు. అలాగే విజయ్ సేతుపతి కూడా సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కానీ తనకు ‘పాన్ ఇండియా స్టార్’ (Pan India Star) అని సంబోధించడం అస్సలు నచ్చదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్ అండ్ డీకే హిందీలో రూపొందించిన ‘ఫర్జీ’ (Farzi) వెబ్ సిరీస్‌ (Web Series) లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్.. సేతుపతిని పాన్ ఇండియా యాక్టర్ అని పిలవడంపై ఆయన స్పందించారు. ఆ పాన్ ఇండియా ట్యాగ్‌తో నేను కంఫర్ట్‌గా లేను. కొన్నిసార్లు అది మనపై ఒత్తిడిని కలిగిస్తుంది. నేను కేవలం నటుడిని, దానికొక లేబుల్ వేయాల్సిన అవసరం లేదు. నేను ప్రతి లాంగ్వేజ్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను. అవకాశం దొరికితే బెంగాలీ, గుజరాతీలో కూడా సినిమా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై రాశీ ఖన్నా సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందరం ముందుగా నటులమని, తమలో ఎవరికీ ఈ పదం నచ్చదని తెలిపింది. ఇది ఒకరకంగా విభజించడమే అవుతుందని చెప్పింది. గతంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని పిలిచేవారు. అది కాస్తా నార్త్, సౌత్‌గా మారింది. దానికి మించి ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు. ఈ డివైడ్ అవసరం లేదని పేర్కొంది. గతేడాది దుల్కర్ సల్మాన్ సైతం ‘పాన్ ఇండియా’ అనే పదం తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఆ పదం తనను నిజంగా చికాకుపెడుతుందని, వినడమే ఇష్టం లేదని చెప్పాడు.

ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, రాశీ ఖన్నా, రెజీనా కసాండ్ర, కేకే మీనన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, కుబ్రా సైత్ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ద్వారానే షాహిద్, విజయ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *