టీఎస్ఆర్టీసీ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. భాగ్యనగరంలో ఇకపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్ రోడ్లపై విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ.. టీఎస్ఆర్టీసీకి 500 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులను ఏడాది వ్యవధిలో రెండు విడతల్లో సరఫరా చేయనుంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మరో 450 బస్సులను అందించనుంది.
మొత్తం బస్సుల మెయింటనెన్స్’కి తెలంగాణ రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈఓ మహేశ్ బాబు చెప్పారు.మరోవైపు… విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఫోటోలను.. మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల ఫోటోలను షేర్ చేశారు. హైదరాబాద్‌లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్.. త్వరలో ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి’, అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆర్టీసీ సేవలను జనాలు పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు ఆర్టీసీ అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. డబుల్ డెక్కర్(Double Decker) బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలోనూ ఈ విషయంపై మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ తన ప్రయత్నాలను వేగం చేసింది. హైదరాబాద్ నగరంలోని మూడు రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ తాజాగా టెండర్లు పిలవనుంది. ఫ్లైఓవర్లు లేని మూడు రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు రూట్లను ఖరారు చేశారు. డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు నిధుల కొరత ఉండడంతో ప్రస్తుతానికి అద్దెకు తీసుకొని నడపాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.