పాత వంతెనలు, రైలు ఇంజిన్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలు బిహార్‌లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా, నిరుపయోగంగా ఉన్న రైలు పట్టాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన సమస్తీపుర్ రైల్వే డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. దాదాపు రెండు కిలోమీటర్లు పొడవున్న రైలు పట్టాలను ఎత్తుకెళ్లడం గమనార్హం. మధుబని లోహత్ షుగర్ మిల్ నుంచి పండోల్ స్టేషన్ వరకు గతంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ వేశారు. అయితే, చాలా కాలం నుంచి ఈ చక్కెర మిల్లు మూతబడింది. దీంతో ఈ మార్గంలో రైల్లు రాకపోకలు నిలిచిపోయి వినియోగంలో లేదు. వీటిపై దొంగల కన్నుపడింది.
ఈ పట్టాలను తొలగించి తీసుకెళ్లిపోగా… జనవరి 24న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదుచేసి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇందులో రైల్వే అధికారుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు, రైల్వే ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటన బాధ్యుల్ని చేస్తూ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
సమస్తీపూర్ రైల్వే డివిజనల్ మేనేజర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘పట్టాల చోరీపై శాఖాపరమైన విచారణకు ఓ కమిటీని నియమించాం.. ఈ విషయం గురించి రైల్వే శాఖకు సకాలంలో సమాచారం ఇవ్వనందుకు ఝంఝర్‌పూర్ ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి శ్రీనివాస్, మధుబని రైల్వే డివిజన్ చెందిన జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్ సహా ఇద్దరు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు.. రైల్వే లైన్‌లోని స్క్రాప్‌ను వేలం వేయకుండా ఆర్పీఎఫ్ సహకారంతో స్క్రాప్ డీలర్‌కు విక్రయించినట్లు సమాచారం.. ఈ విషయంపై రైల్వే శాఖలో కలకలం రేగుతోంది’’ అని అన్నారు.
Read Latest National News And Telugu News