2 కి.మీ. రైల్వే ట్రాక్ను ఎత్తుకెళ్లిన దొంగలు బీహార్.. వెరైటీ దొంగతనాలకు అడ్డాగా మారుతోంది. ఇటీవలె రైలు ఇంజిన్, సెల్ టవర్లు, వాడుకలో లేని బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా రైలు పట్టాలు ఎత్తుకెళ్లారు. చాన్నాళ్లుగా వాడుకలో లేని రైలు పట్టాలను ఊడదీసుకుని వెళ్లారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లోహత్ షుగర్ మిల్లు కోసం అప్పట్లో రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఆ మిల్లు మూతపడడంతో రైల్వే ట్రాక్నూ ఉపయోగించడం లేదు. ఇదే అదనుగా భావించిన దొంగలు రైల్వే ట్రాక్‌ను మాయం చేసి దానిని స్క్రాప్ డీలర్లకు అమ్మేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ చోరీ ఘటనలో ఝంజర్‌పూర్ అవుట్ పోస్టుకు కమాండ్‌గా ఉన్న శ్రీనివాస్, మధుబనికి చెందిన జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వారిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు. రైలు ట్రాక్‌ను వేలం వేయకుండా, టెండర్లకు పిలవకుండా వారే ఓ వ్యాపారికి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు.
©️ VIL Media Pvt Ltd.