ఏపీలో ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. నారా లోకేశ్ యువ గళం పేరిట పాదయాత్ర చేస్తుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’పై రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ సైతం రేసులోకి వచ్చింది. తమకు కొండంత బలమైన ‘వైఎస్ జగన్’ ఫొటోతో జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇప్పటికే గడప పడగకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న అధికార పార్టీ.. ప్రతి ఇంట్లో జగన్ పేరు వినిపించేలా కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట తయారు చేసిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. రాజకీయాల్లో మిగతా ప్రతిపక్ష నేతలకు.. తనకు ఉన్నది విశ్వసనీయత అని జగన్ పదే పదే చెబుతుంటారు. దాన్ని గుర్తుకు తెచ్చేలా కొత్త స్లోగన్ రూపొందించడం గమనార్హం.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. దీంతో తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారి ఇళ్లలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను అతికించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తమ పార్టీతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడంతోపాటు.. మళ్లీ జగనే అధికారంలోకి రావాలనే సానుకూల భావనను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం అధికార పార్టీ ఈ కొత్త స్లోగన్‌ను తీసుకొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదం ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు ‘మా నమ్మకం నువ్వే’నంటూ జనాలను తమవైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ రావాలి’ లాంటి స్లోగన్లతో వైఎస్సార్సీపీ సర్కారుపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం అధికార పార్టీ వ్యూహకర్తలు ఈ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు.
జగన్ బస్సు యాత్ర?
అధికార పార్టీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఏప్రిల్ నుంచి సీఎం జగన్ సైతం బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి మండలాన్ని టచ్ చేసేలా.. ముఖ్యమంత్రి పల్లె నిద్ర చేసేలా అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. ఈ సందర్భంగా సీఎం నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత తర్వగా పరిష్కరించనున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని జగన్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.