ఏపీలో వారికి శుభవార్త.. ఈ నెల 10న అకౌంట్‌లోకి డబ్బులు, ఒక్కొక్కరికి రూ.లక్ష

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది. వైఎస్సార్‌ కళ్యాణమస్తు (Ysr Kalyanamasthu), వైఎస్సార్‌ షాదీ తోఫా (Ysr Shadi Tofa) పథకం ఆర్థిక సాయాన్ని ఈనెల 10న ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు.. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో పథకం వర్తిస్తుంది.

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.లక్షా 20 వేలు.. దివ్యాంగులకు అయితే ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇక భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. పెళ్లి అయిన 60 రోజుల్లోపు http://gsws-nbm.ap.gov.in ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు.

అలాగే రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో పాటూ ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు తీసుకెళితే.. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ (డబ్ల్యూడీపీఎస్‌)లు దరఖాస్తు ప్రక్రియను చేస్తారు. వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు నిండి.. వధూవరులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ పథకానికి మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు వర్తించదు. ప్రభుత్వం పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఇచ్చింది. ఎవరికైనా సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా అనర్హులు.. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉండొద్దు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *