అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నెలా అందజేసే ‘అవార్డ్ ఆఫ్ ది మంత్’ రేసులో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిలిచాడు. అతనితో పాటు జనవరి నెలకి సంబంధించి టీమిండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కూడా పోటీలో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ దేవాన్ కాన్వెని కూడా ఐసీసీ నామినేట్ చేసింది. దాంతో ఈ ముగ్గురిలో ఒకరికి త్వరలోనే ఐసీసీ అవార్డుని ప్రకటించనుంది.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న మహ్మద్ సిరాజ్.. జనవరిలో శ్రీలంకపై 2/30, 3/30, 4/32తో సత్తాచాటాడు. అనంతరం న్యూజిలాండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 4/46తో చెలరేగిన ఈ లోయర్ బాయ్.. రాయ్‌పూర్ వన్డేలోనూ 1/10తో పొదుపుగా బౌలింగ్ చేశాడు.
శుభమన్ గిల్ కూడా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకపై వరుసగా 70, 21, 116 పరుగులు చేసిన ఈ యంగ్ ఓపెనర్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో 149 బంతుల్లోనే 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేవలం 23 ఏళ్ల వయసులోనే వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా గిల్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ దేవాన్ కాన్వె జనవరిలో పరుగుల మోత మోగించేశాడు. ఒక్క నెలలోనే మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కరాచీ వేదికగా జరిగిన టెస్టులో పాకిస్థాన్‌పై 122 పరుగులు చేసిన దేవాన్ కాన్వె.. సిరీస్‌ని సమం చేసేందుకు వీరోచితంగా పోరాడాడు. అలానే వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. భారత్‌తో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 386 పరుగుల లక్ష్యఛేదనలో ఒంటరిగా 138 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకి చెమటలు పట్టించేశాడు. అలానే టీ20ల్లోనూ 52, 35 పరుగులు చేశాడు.